ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ.. ముంబై ఇండియన్స్ ఖేల్ ఖతం!
ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆట ముగిసింది. ఆర్సీబీ చేతిలో ఓటమితో ఈ సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ నిష్క్రమించింది. ఆదివారం రాయ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన చోట కృనాల్ పాండ్యా వీరోచిత పోరాటం ఆర్సీబీని విజయం వైపు తీసుకెళ్లింది.
167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. కృనాల్ పాండ్యా (46 బంతుల్లో 73) తన కెరీర్‌లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలకపాత్ర పోషించగా.. చివర్లో భువనేశ్వర్ సిక్సర్ కొట్టి ఆర్సీబీకి థ్రిల్లింగ్ విజయాన్ని అందించాడు. జాకబ్ బెతెల్ (27) పర్వాలేదనిపించాడు. ముంబై బౌలర్లలో కార్బిన్ బోస్క్ 4 వికెట్లు తీయగా, దీపక్ చాహర్ 2, గజన్‌ఫర్, రాజ్ బవాలు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. తిలక్ వర్మ (57) హాఫ్ సెంచరీతో రాణించగా..
నమన్ ధిర్ (47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు మినహా మిగతా ముంబై బ్యాటర్లు విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లతో అదరగొట్టగా, హాజిల్‌వుడ్, రసిక్ సలామ్, షెపర్డ్ తలా ఒక వికెట్ తీశారు. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను ముంబై చేజేతులా ఓటమిని కొనితెచ్చుకుంది. ఫీల్డింగ్‌లో తప్పిదాలు, ఆఖరి ఓవర్‌లో రాజ్ బవా ఒత్తిడి లోనయ్యి వరుస వైడ్‌లు, నోబాల్ వేయడం కూడా ముంబై కొంపముంచింది. ఈ ఓటమితో ముంబై ప్లేఆఫ్స్ చేరకుండానే ఐపీఎల్ 19వ సీజన్ నుంచి ఎలిమినేట్ అయింది. మరోవైపు ఆర్సీబీ మాత్రం 11 మ్యాచ్‌ల్లో ఏడో విజయంతో 14 పాయింట్లు సాధించి మెరుగైన రన్‌రేట్‌తో టేబుల్ టాపర్‌గా నిలిచింది.