Shashi Tharoor | ఎస్‌ఐఆర్ వల్లే బెంగాల్‌లో బీజేపీ గెలుపు.. కేరళలో మేం కూడా.. : శశిథరూర్
Shashi Tharoor : పశ్చిమ బెంగాల్ (West Bengal) ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో జరిగిన అవకతవకలే బెంగాల్‌లో బీజేపీ (BJP) గెలుపునకు ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. ఓటర్ల జాబితా నుంచి భారీ సంఖ్యలో పేర్లను తొలగించడం, అలా తొలగించిన పేర్ల సంఖ్య బీజేపీ గెలుపు మార్జిన్‌కు దాదాపు సమానంగా ఉండటాన్ని ఆయన ప్రశ్నించారు. స్టాన్‌ఫోర్డ్ ఇండియా కాన్ఫరెన్స్‌లో జరిగిన ‘ఇండియా, దటీజ్ భారత్’ అనే రౌండ్‌టేబుల్ సమావేశంలో థరూర్ తన విశ్లేషణను పంచుకున్నారు.
‘పశ్చిమబెంగాల్‌లో ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 91 లక్షల పేర్లను తొలగించారు. వారిలో తాము జీవించి ఉన్నామని, ఓటు హక్కుకు అర్హులమని చెబుతూ 34 లక్షల మంది అప్పీల్ చేసుకున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి కేసును విడివిడిగా విచారించాలి. కానీ ఎన్నికలకు ముందు కేవలం కొన్ని వందల కేసులను మాత్రమే పరిష్కరించారు. ఈ రోజుకీ సుమారు 31-32 లక్షల మంది అప్పీళ్లు పెండింగ్‌లోనే ఉన్నాయి’ అని శశిథరూర్ చెప్పారు. ఈ గణాంకాలను బీజేపీ గెలుపు మార్జిన్‌తో పోల్చి చూపిస్తూ థరూర్ కీలకమైన ప్రశ్నను లేవనెత్తారు. ‘బెంగాల్‌లో బీజేపీ సుమారు 30 లక్షల ఓట్ల తేడాతో గెలిచింది. ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయిన వారి సంఖ్య కూడా దాదాపు అంతే ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇది పూర్తిగా న్యాయమైన, ప్రజాస్వామ్యబద్ధమైన ప్రక్రియేనా..? ఇదే నా ప్రశ్న..’ అని థరూర్ అన్నారు.
నకిలీ, వలస వెళ్లిన, చనిపోయిన ఓటర్లను జాబితా నుంచి తొలగించడంతో తనకు ఎలాంటి సమస్య లేదని, కానీ లక్షలాది మంది అర్హులైన ఓటర్లు తమ హక్కును కోల్పోవడమే ఆందోళనకరమని శశిథరూర్ అన్నారు. ఇదే సమయంలో కేరళలో ఓటర్ల జాబితా సవరణవల్ల తమ కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కేరళలో సీపీఎం డబుల్, ట్రిపుల్ ఓట్లను నమోదు చేయడంలో ఆరితేరిందని, ఒకే వ్యక్తికి నాలుగు వేర్వేరు బూత్‌లలో ఓట్లు ఉండేవని చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో నకిలీ ఓట్లు తొలగిపోవడం తమకు లాభించిందని అన్నారు. కేరళ, తమిళనాడులో బెంగాల్‌లా లక్షల్లో కాకుండా ఓటు పునరుద్ధరణ కోసం కేవలం కొన్ని వందల అప్పీళ్లు మాత్రమే వచ్చాయని థరూర్ పేర్కొన్నారు.