వీబీ జీ రామ్ జీ స్కీస్ జూలై 1 నుంచి.. అప్లై చేసుకున్న 15 రోజుల్లో పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి
హైదరాబాద్, వెలుగు : గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటివరకు అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీ నరేగా) స్థానంలో కేంద్ర ప్రభుత్వం ‘వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్’ (వీబీ- జీ రామ్ జీ) చట్టాన్ని తీసుకురానుంది. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో భాగంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఉపాధి కల్పన కోసం ఈ కొత్త చట్టాన్ని రూపొందించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది.
ప్రస్తుతం కొనసాగుతున్న ఉపాధి హామీ చట్టం (నరేగా) 2026 జూలై 1వ తేదీ నుంచి రద్దు కానుంది. అదేరోజు నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వీజీ జీ రామ్ జీ చట్టం అమల్లోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మార్పు కారణంగా పనులకు ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, పాత పథకం కింద ఉన్న పనులు కొత్త చట్టం నిబంధనల ప్రకారం కొనసాగుతాయని వెల్లడించింది. కాగా ఈ ఏడాది జూన్ 30 నాటికి ఎంజీ నరేగా స్కీమ్ కింద కొనసాగుతున్న అన్ని ప్రాజెక్టులు యథావిధిగా కొత్త వ్యవస్థ కింద కొనసాగుతాయని తెలిపింది. కొత్త గ్రామీణ రోజ్‌గార్ గ్యారంటీ కార్డులు జారీ అయ్యేంత వరకు ప్రస్తుతం ఉన్న ఈ–-కేవైసీ జాబ్ కార్డులే చెల్లుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. కార్మికుల ఈ–-కేవైసీ ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నప్పటికీ వారికి ఉపాధి లభిస్తుందని, జాబ్‌కార్డులు లేని కొత్త కార్మికులు గ్రామ పంచాయతీలో నమోదు చేసుకోవాలని సూచించింది.
కొత్త చట్టం ప్రకారం అర్హత కలిగిన ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి కనీసం 125 రోజుల పనిని చట్టబద్ధంగా కల్పిస్తారు. గతంలో ఇది 100 రోజులుగా ఉండేది. గ్రామీణ ఉత్పాదక ఆస్తుల సృష్టితో పాటు పర్యావరణ పరిరక్షణ, నీటి భద్రత, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పనులు చేపట్టనున్నారు. కొత్త చట్టం ప్రకారం పెరిగిన వేతనాలు అమల్లోకి వస్తాయి. పాత వేతనాల స్థానంలో కొత్త రేట్లను కేంద్రం త్వరలో ప్రకటించనుంది. అదేవిధంగా నివాస స్థలం నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలోనే పని కల్పించనున్నారు. ఒకవేళ అంతకంటే దూరంగా పని ఇస్తే అదనంగా 10 శాతం వేతనం చెల్లించనున్నారు. పని కోసం దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా పని కల్పించకపోతే ఆ కూలీలకు నిరుద్యోగ భృతి ఇస్తారు. మొదటి 30 రోజులకు కనీస వేతనంలో 1/4 వంతు, ఆ తర్వాత సగం వేతనాన్ని భృతిగా చెల్లించనున్నారు. పని పూర్తి చేసిన 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించాల్సి ఉండగా..
ఒకవేళ ఆలస్యమైతే ప్రతి రోజుకు 0.05 శాతం చొప్పున పరిహారం చెల్లించనున్నారు. నిధుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా.. వీబీ జీ రామ్ జీ చట్టం కింద చేసే పనులకు అవసరమైన నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి. ఈశాన్య, హిమాలయ రాష్ట్రాల్లో 90:10 నిష్పత్తిలో, ఇతర రాష్ట్రాల్లో 60:40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతాలకు 100 శాతం నిధులు కేంద్రమే ఇస్తుంది. పనుల ఎంపికలో గ్రామసభ ఆమోదంతో రూపొందించిన ‘వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్’ కీలకం కానుంది. అదేవిధంగా కూలీల కోసం పని ప్రదేశంలో తాగునీరు, నీడ, విశ్రాంతి స్థలం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వంటి సౌకర్యాలు కచ్చితంగా సమకూర్చాలి. పనుల్లో పారదర్శకత కోసం జనతా బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో పని వివరాలు, కూలీల సంఖ్య, ఖర్చు వంటి వివరాలు ప్రదర్శించనున్నారు. కాంట్రాక్టర్లకు, భారీ యంత్రాలతో సంబంధం లేకుండా కేవలం మానవ శ్రమతోనే పనులు పూర్తి చేయనున్నారు.