Suvendu Adhikari | నందిగ్రామ్ స్థానాన్ని వదులుకున్న బెంగాల్ సీఎం సువేందు అధికారి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి, భవానీపూర్ సీటును నిలుపుకున్నారు. నందిగ్రామ్ స్థానాన్ని వదులుకున్నారు. బుధవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో భవానీపూర్ ఎమ్మెల్యేగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. (Suvendu Adhikari) ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. నందిగ్రామ్ సీటును వదులుకున్నట్లు చెప్పారు. ‘నందిగ్రామ్ నుంచి (ఉప ఎన్నిక ద్వారా) మరొకరు ఎమ్మెల్యేగా ఎన్నికవుతారు. అయితే రాబోయే ఐదేళ్లలో అక్కడి ప్రజలు నా లేమిని ఏమాత్రం అనుభవించనివ్వను. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో పాటు, నందిగ్రామ్ ప్రజలకు నేను ఇచ్చిన అభివృద్ధి వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తా’ అని అన్నారు.
కాగా, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సువేందు అధికారి రెండు స్థానాల్లో పోటీ చేశారు. భవానీపూర్, నందిగ్రామ్ నియోజక వర్గాల్లో ఆయన గెలిచారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి కంచుకోట అయిన భవానీపూర్ స్థానంలో 15,105 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మరోవైపు సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లో ప్రత్యర్థి టీఎంసీ అభ్యర్థిని పవిత్ర కర్‌పై 9,665 ఓట్ల ఆధిక్యంతో సువేందు అధికారి గెలిచారు. తన స్థానాన్ని తిరిగి దక్కించుకున్నారు. అయితే భవానీపూర్ స్థానాన్ని నిలుపుకున్న సీఎం సువేందు అధికారి, సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌కు రాజీనామా చేశారు.