Select Location
All Locations
State
Region
City / District
భూమిని తాకే సూర్యరశ్మి తగ్గుతోంది!

భూమిని తాకే సూర్యరశ్మి తగ్గుతోంది!

మానవాళి సాంకేతిక ప్రగతికి సూచికలుగా భావిస్తున్న ఉపగ్రహాలు, రాకెట్ ప్రయోగాలు.. ఇప్పుడు భూమి చుట్టూ ఉన్న పర్యావరణానికి కొత్త శాపంగా మారుతున్నాయి. నిరంతరాయంగా సాగుతున్న అంతరిక్ష ప్రయోగాలు ఎగువ వాతావరణాన్ని తీవ్రంగా కలుషితం చేస్తున్నాయని, దీనివల్ల భూమికి చేరే సూర్యరశ్మి పరిమాణం క్రమంగా తగ్గుతోందని బ్రిటన్‌కు చెందిన ‘యూనివర్సిటీ కాలేజ్ లండన్’(యూసీఎల్‌) పరిశోధకుల అధ్యయనంలో విల్లడైంది.

ప్రఖ్యాత అంతర్జాతీయ జర్నల్ ‘ఎర్త్‌ ఫ్యూచర్’లో మే 14న ప్రచురితమైన ‘రేడియేటివ్ ఫోర్సింగ్ అండ్ ఓజోన్ డిప్లిషన్ ఆఫ్ ఎ డికేడ్‌ ఆఫ్ శాటిలైట్ మెగాకాన్స్టెలేషన్ మిషన్స్’ అనే పరిశోధనా పత్రం ఈ ఆందోళనకర అంశాలను తెరపైకి తెచ్చింది. నియంత్రణ లేని జియో ఇంజినీరింగ్ ప్రయోగం! యూనివర్సిటీ కాలేజ్ లండన్‌కు చెందిన శాస్త్రవేత్తలు కానర్ ఆర్.బార్కర్, ప్రొఫెసర్ ఎలోయిస్ ఎ.మరైస్, ఎరిక్ వై నేతృత్వంలోని బృందం 2020 నుంచి 2022 మధ్య కాలంలో జరిగిన రాకెట్ ప్రయోగాలు, అంతరిక్షంలో కాలం చెల్లిన ఉపగ్రహాల అవశేషాలపై సమగ్ర పరిశోధన చేసింది. ‘రాకెట్ ప్రయోగాలు వాతావరణ కాలుష్యానికి ఒక ప్రత్యేకమైన మూలంగా మారాయి. 

ఇవి హానికరమైన రసాయనాలను నేరుగా ఎగువ వాతావరణ పొరల్లోకి విడుదల చేస్తున్నాయి. తద్వారా భూమిపై ఇప్పటివరకు అత్యంత స్వచ్ఛంగా భావించిన సహజ వాతావరణం కలుషితమవుతోంది’ అని యూసీఎల్‌ ప్రధాన పరిశోధకుడు కానర్ బార్కర్ తెలిపారు. గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడానికి శాస్త్రవేత్తలు ప్రతిపాదించే కృత్రిమ ‘జియో ఇంజినీరింగ్’ పద్ధతుల తరహాలోనే.. ఈ ఉపగ్రహ ప్రయోగాల వల్ల విడుదలవుతున్న కాలుష్యం భూమిని తాకే సూర్యరశ్మిని అడ్డుకుంటోందని పరిశోధకులు తేల్చారు. ఇది భూమిపై స్వల్ప శీతలీకరణ ప్రభావాన్ని చూపినప్పటికీ పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఇది చాలా తక్కువని, అయితే దీనివల్ల భవిష్యత్తులో ఊహించని తీవ్ర పర్యావరణ పరిణామాలు ఎదురవుతాయని ప్రాజెక్ట్ లీడ్ ప్రొఫెసర్ ఎలోయిస్ మరైస్ హెచ్చరించారు. పరిస్థితి చేతులు దాటిపోకముందే దేశాధినేతలు చర్యలు చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు.


Sakshi 1 hour ago
Home Flash News