ఏపీలో 3వ బిడ్డకు రూ.30 వేలు, 4వ బిడ్డకు రూ.40 వేలు..చంద్రబాబు సంచలన ప్రకటన (video)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర జనాభా సమతుల్యతపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. "పిల్లలు భారం కాదు.. దేశానికి, రాష్ట్రానికి వారే అసలైన సంపద" అని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన ఒక బహిరంగ సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, రాష్ట్రంలో జనాభా తగ్గుదల రేటును అరికట్టేందుకు ప్రభుత్వం తరపున సరికొత్త ప్రోత్సాహకాలను ప్రకటించారు. కుటుంబంలో మూడో బిడ్డ పుడితే రూ.30 వేలు, ఒకవేళ నాలుగో బిడ్డ పుడితే రూ.40 వేల ఆర్థిక సహాయం అందిస్తామని సంచలన ప్రకటన చేశారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి విధివిధానాలను త్వరలోనే ప్రజల ముందుకు తీసుకువస్తామని సీఎం తెలిపారు. ముఖ్యమంత్రి ఈ కీలక ప్రకటన చేయగానే సభకు హాజరైన ప్రజల నుండి ఊహించని రీతిలో భారీ స్పందన లభించింది. అందరూ పెద్ద పెట్టున కేకలు వేస్తూ, చప్పట్లతో ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.
మరోవైపు, కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకంపై కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ పథకం కింద పాఠశాల విద్యార్థుల తల్లులకు ఏడాదికి ఇస్తున్న రూ.15,000 ఆర్థిక సహాయాన్ని, భగవంతుడు కరుణించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగైతే భవిష్యత్తులో మరింత పెంచడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు.