మిషన్ భగీరథ సమస్యపై 1,620 ఫిర్యాదులు
హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సమస్యలపై మిషన్ భగీరథ టోల్‌ఫ్రీ నంబర్ 1916కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో దీనికోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇది 24/7 అందుబాటులో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం కలిగినప్పుడు, పైపులైన్ లీకేజీలు ఉన్నప్పుడు, నీటి నాణ్యత సరిగాలేకపోయినా, ఇతర సమస్యలు ఎదురైనా ఈ నంబర్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటివరకు 1,620 ఫిర్యాదులు అందినట్టు మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి చెప్పారు.
వీటిలో 366 ఫిర్యాదులు మున్సిపాలిటీ పరిధికి చెందినవి కాగా, మిగతా 1,254లో 1,193 ఫిర్యాదులను ఇప్పటివరకు పరిష్కరించినట్టు తెలిపారు. ఇంకా 61 ఫిర్యాదులు పరిష్కరించాల్సి ఉన్నదని పేర్కొన్నారు. వేసవి కావడంతో టోల్‌ఫ్రీ నంబర్ 1916కు ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని వెంటనే పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 24 వేల గ్రామాల్లో ఇంటింటికీ అందించేందుకు మిషన్ భగీరథ అవసరాల కోసం ప్రధాన నదుల నుంచి 42.67 టీఎంసీల నీటిని పంపింగ్ చేస్తున్నట్టు వివరించారు.