YS Sharmila | ఏపీలో పెట్రోల్,డీజిల్‌పై 31 శాతం అధిక వ్యాట్ వసులు సిగ్గుచేటు : వైఎస్ షర్మిల
అమరావతి : దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ ( Petrol ) ,డీజిల్ ( Diesel ) పై వసూలు చేస్తున్న 31 శాతం అధిక వ్యాట్ ( VAT ) ను వెంటనే తగ్గించాలని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila) డిమాండ్ చేశారు. అత్యధిక ఇంధనం ధరలు ఏపీలో ఉన్నాయని ట్విటర్ వేదికలో ఆరోపించారు.
ఏపీ రోల్ మోడల్ అంటే వ్యాట్ పేరుతో జనాలను బాదడమా అంటూ ప్రశ్నించారు. లీటర్ ధర మీద అదనంగా రూ.4 గుంజడంపై నియంత్రణ ఎందుకు లేదని అన్నారు. పొదుపు చర్యలు ప్రజలకేనా.. పన్నులు తగ్గించడంలో ప్రభుత్వానికి బాధ్యత లేదా అని నిలదీశారు. అభివృద్ధిలో చివరిస్థానం, ఇంధనం ధరల్లో మొదటి స్థానం ఉన్నందుకు సిగ్గుపడాలని అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.77 పైసలుండగా, అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర 113. 62 పైసలుందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో లీటర్ డీజిల్ ధర రూ .
93.75 పైసలుండగా ఎన్డీయేలో పెద్దన్న పాత్ర పోషించే రాష్ట్రం ఏపీలో డీజిల్ ధర రూ 101.24 పైసలుండడం దారుణమని అన్నారు. పక్కరాష్ట్రం తమిళనాడుతో పోల్చినా రూ. 10 రూపాయలు అదనంగా ఏపీలో చమురు ధరలున్నాయని విమర్శించారు. కర్ణాటకతో రూ . 7, తెలంగాణ, కేరళతో చూసినా రూ. 4 రూపాయలు ధరాభారం అధికంగా ఉందని ఆరోపించారు. అధిక వ్యాట్ , అడిషనల్ వ్యాట్ పేరుతో ఏటా ప్రజలపై పడుతున్న 10 వేల కోట్లు అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు. ఆదాయం పెంపు మార్గాలని 2014 నుంచి టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ముక్కుపిండి వసూలు చేయడం దుర్మార్గపు చర్య అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పడే భారాన్ని మోదీ మెడలు వంచి తీసుకు రావాలని సీఎం చంద్రబాబుకు సూచించారు.