Donald Trump | ఇరాన్‌పై మరోసారి దాడులకు సిద్ధమవుతున్న అమెరికా.. ఈసారి ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 2.0’
Donald Trump : ఇరాన్‌పై అమెరికా మరోసారి దాడులకు సిద్ధమవుతోందా..? తాజా పరిణామాలు చూస్తుంటే ఔననే అనిపిస్తోంది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ, శాంతి చర్చలు కొలిక్కి రావడం లేదు. చర్చల్లో చాలా రోజులుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. చర్చలు ఎటూ తేలడం లేదు. ఇరాన్, అమెరికా.. ఎవరికి వారు మొండి పట్టుదలతో ఉన్నారు. దీంతో సమస్య పరిష్కారానికి సైనిక చర్య ఒక్కటే సరైన దారి అని అమెరికా భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అంటే, మరోసారి ఇరాన్‌పై దాడులు చేసేందుకు అమెరికా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈసారి దాడులకు ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 2.0’ అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది. అందులోనూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తాజాగా చైనాలో పర్యటించడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది. ఇరాన్ అణ్వాయుధ దేశం కావడాన్ని అమెరికాతోపాటు చైనా కూడా వ్యతిరేకించినట్లు అమెరికా తెలిపింది. ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండకూడదని ఇరు దేశాలు భావిస్తున్నాయి. దీంతో తాజా చర్చల్లో ఇరాన్‌పై దాడులు, అణ్వాయుధ తయారీ, హార్ముజ్ జలసంధి వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ఇరాన్‌పై దాడులకు చైనా మద్దతును అమెరికా కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, మళ్లీ దాడులకు దిగే అంశంపై అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రెండు దేశాల మధ్య గత ఏప్రిల్ 7 నుంచి కాల్పుల విరమణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
నెల రోజులు గడిచినప్పటికీ శాశ్వత శాంతి ఒప్పందం మాత్రం కుదరడం లేదు. ఇరాన్ శాంతి ప్రతిపాదనల్ని అమెరికా అంగీకరించడం లేదు. అణ్వాయుధ తయారీ అంశంలో అంగీకారం కుదరడం లేదు. అలాగే, అమెరికా ప్రతిపాదనల్ని ఇరాన్ వ్యతిరేకిస్తోంది. ప్రస్తుత పరిస్తితుల్లో ఇరాన్‌పై దాడులకు అమెరికా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా ఇందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా ప్రతినిధులు తెలిపారు. త్వరలో ఇరాన్–అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదరకపోతే మళ్లీ దాడులు ప్రారంభమయ్యే అవకాశం మాత్రం ఉంది. ఇదే సమయంలో అవసరమైతే తిరిగి యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ కూడా ప్రకటించింది. మరోవైపు ఇరాన్‌పై యుద్దం అంశం ట్రంప్‌కు రాజకీయంగా ఎలాంటి ఇబ్బందుల్ని తెస్తుందో చూడాలి. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో మిడ్ టర్మ్ ఎన్నికలు జరుగుతాయి.