Select Location
All Locations
State
Region
City / District
విజయ్‌ సర్కార్‌ దూకుడు.. వెలుగులోకి భారీ స్కాం

విజయ్‌ సర్కార్‌ దూకుడు.. వెలుగులోకి భారీ స్కాం

సాక్షి, చెన్నై: తమిళనాడు ఇంధన వనరులు, న్యాయశాఖ మంత్రి సి.టి.ఆర్‌. నిర్మల్‌ కుమార్‌ నేతృత్వంలో తమిళనాడు విద్యుత్‌ బోర్డు ప్రధాన కార్యాలయంలో జరిగిన వరుస సమీక్షలలో భారీ స్కాం బయటపడింది. తమిళనాడు గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఇటీవల జరిపిన నిధుల కేటాయింపులు, కొన్ని ప్రాజెక్టుల ఆమోదాల్లో భారీ అక్రమాలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఎలాంటి పారదర్శకత లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా అత్యంత అత్యవసరంగా కొన్ని సంస్థలకు అనుమతులు, నిధుల కేటాయింపులు మంజూరు చేసినట్లు మంత్రి జరిపిన విచారణలో తేలింది.

ఇద్దరు కీలక అధికారుల సస్పెండ్‌ తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో, శాఖాపరమైన నిష్పాక్షిక విచారణకు ఎలాంటి అడ్డంకులు కలగకుండా ఉండేందుకు , పరిపాలనాపరమైన చర్యల్లో భాగంగా ఇద్దరు అగ్ర శ్రేణి అధికారులను ప్రభుత్వం తక్షణమే సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు గురువారం సీఎం విజయ్‌ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెండ్‌ అయిన అధికారులలలో వి. కాసి – చీఫ్‌ ఫైనాన్షియల్‌ కంట్రోలర్‌ (రెవెన్యూ) , పి. చంద్రశేఖరన్‌ – చీఫ్‌ ఇంజనీర్‌ (సాంప్రదాయేతర ఇంధన వనరులు) ఉన్నారు. పరిపాలనాపరమైన దుర్వినియోగం, విధుల్లో అలసత్వం , నిధుల మంజూరులో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై వీరిద్దరిపై ఈ వేటు పడింది. రిటైర్డ్‌ డైరెక్టర్‌ పెన్షన్‌ బెనిఫిట్స్‌ నిలిపివేత ఈ అవినీతి ఆరోపణలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ రిటైర్డ్‌ డైరెక్టర్‌ (టెక్నికల్‌) ఎస్‌. 

మంగళనాథన్‌ రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌పై ప్రభుత్వం కోరడా ఝుళిపించింది. ఆయనకు అందాల్సిన అన్ని రకాల పెన్షన్‌ ప్రయోజనాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఇంధన శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ అక్రమాలకు పాల్పడిన సదరు అధికారులందరిపై విద్యుత్‌ బోర్డు నిబంధనల ప్రకారం శాఖాపరమైన పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని, విచారణ అనంతరం తదుపరి కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.అధికార పగ్గాలుచేపట్టగానే, అవినీతిని నిర్మూలిస్తామన్న విజయ్‌ ప్రభుత్వం తాజాగా భారీ స్కాంను గుర్తించి ఇద్దరు కీలక అధికారులపై వేటు వేయడం ఇతర అధికారుల గుండెల్లో గుబులు రేకెత్తించింది.


Sakshi 47 minutes ago
Home Flash News