బీటెక్ రవి.. నువ్వెంత.. నీ బతుకెంత?: అవినాష్ రెడ్డి హెచ్చరిక
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబుకు అసలు బుద్దుందా?.. ఎవరిది గొడ్డలి పార్టీ అని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తారా?. దస్తగిరిని నెత్తిన పెట్టుకుంది టీడీపీ కాదా?. బీటెక్ రవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నువ్వెంత.. నీ బతుకెంత.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.
పులివెందులలో వైఎస్సార్‌సీపీ బూత్ లెవల్ కార్యకర్తల సమావేశం జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఇతర కీలక నాయకులు హాజరయ్యారు. ఈ సందర్బంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘అమరావతిలో చంద్రబాబు కట్టే బిల్డింగుల అద్దాలకు అయ్యే ఖర్చుతో రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలన్నిటినీ పూర్తి చేయవచ్చు. ఇలాంటి దోపిడీని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు.. ఎదురుదాడికి దిగుతారు. గతంలో పన్నులు తగ్గిస్తే.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయన్నారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆ పని మాత్రం చేయడం లేదు.
వీటన్నిటిపై వైఎస్ జగన్ ప్రశ్నిస్తే జవాబు లేదు. మీరు చేస్తున్న తప్పులను సరిచేసుకోండి అంటే వాళ్లు.. స్వర్గీయ రాజారెడ్డి గురించి మాట్లాడుతున్నారు. లేదంటే వైఎస్సార్ గురించి మాట్లాడతారు. గొడ్డలి పార్టీ అంటారు. అసలు చంద్రబాబుకు బుద్ధుందా?. తానే గొడ్డలితో కిరాతకంగా చంపానని దస్తగిరి చెప్తే.. అతన్ని నెత్తిన పెట్టుకుని మోస్తున్నది మీ పార్టీ కాదా?. ఏరకంగా మాది గొడ్డలి పార్టీ అవుతుంది.. గొడ్డలి పార్టీ మీది. గొడ్డలితో నరికి చంపిన వాడిని నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తున్నది మీరు. మా ప్రశ్నలకి సమాధానం లేక.. చేతిలో అధికారం ఉందని నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఇక్కడ పులివెందులలో ఉన్న టీడీపీ నాయకులు కూడా మాట్లాడటం మొదలుపెట్టారు. వీళ్లు అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో పులివెందులకు కన్నం వేసి దోచేసుకుంటున్నారు.