Select Location
All Locations
State
Region
City / District
ఉద్యోగ నేతలకు బదిలీల్లో తాయిలం!.. నిబంధనలకు నీళ్లొదిలిన రాష్ట్ర ఎక్సైజ్‌ కమిషనర్‌

ఉద్యోగ నేతలకు బదిలీల్లో తాయిలం!.. నిబంధనలకు నీళ్లొదిలిన రాష్ట్ర ఎక్సైజ్‌ కమిషనర్‌

హైదరాబాద్‌, మే 31 (నమస్తే తెలంగాణ): ఎక్సైజ్‌ కమిషనర్‌ చేవూరి హరికిరణ్‌ తాను రూపొందించిన నిబంధనలను తానే తుంగలో తొక్కి ఎక్సైజ్‌ ఉద్యోగ సంఘం నేతలకు బహుమతిగా ఇచ్చారు. నిజామాబాద్‌ డిప్యూటీ కమిషనర్‌ సోమిరెడ్డి ఘటనలో ధర్నాలు, ఉద్యమాలు చేయకుండా, తన అదుపు ఆజ్ఞల్లో ఉన్నందుకు కృతజ్ఞతగా ఆయన ఈ తాయిలం ప్రకటించారనే చర్చ నడుస్తున్నది. బాధిత అధికారి దవాఖానలో చికిత్స పొందుతున్న సమయంలో ఎక్సైజ్‌ ఫోరం నేతలు సమస్య సమసిపోయిందని మీడియాను తప్పుతోవ పట్టించినందుకు ఈవిధంగా రుణం తీర్చుకున్నారని ఎక్సైజ్‌ ఉద్యోగులు అంటున్నారు.

గతంలో జరిగిన ఎక్సైజ్‌ కానిస్టేబుళ్ల బదిలీల విషయంలో కఠిన నిబంధనలు అమలుచేశారు. పసిపిల్లలను వదిలి దూర ప్రాంతాలకు వెళ్లి పనిచేయలేమని మహిళా కానిస్టేబుళ్లు దండం పెట్టినా కనికరించకుండా.. 8ఎఫ్‌ రూల్స్‌, రూల్‌గర్రలు అంటూ వారిని జిల్లాలు దాటించారు. అటువంటి కమిషనర్‌ ఎక్సైజ్‌ ఆఫీస్‌ స్టాఫ్‌ అధికారుల బదిలీలకు వచ్చే సరికి తన ఇష్టారాజ్యాన్ని ప్రదర్శించారు. తానే అమల్లోకి తెచ్చిన ఆరేండ్ల కాలపరిమితిని, యూనిట్‌ టు యూనిట్‌ కట్టుబాటును ఎత్తివేసి ఏకంగా ఆరుగురు ఆఫీస్‌ బేరర్స్‌కు పనిచేస్తున్న చోటనే తిరిగి పోస్టింగ్‌ ఇచ్చారు. ఇది నిబంధనలకు విరుద్ధమని శాఖ అధికారులు చేసిన సూచనలను కూడా పక్కనపెట్టి ఎక్సైజ్‌ ఉద్యోగ సంఘాల నేతలకు రెడ్‌కార్పెట్‌ పరిచారు. సంఘం నేతలకు తిరిగి అదే చోట పోస్టింగ్‌ ఇటీవల ఎక్సైజ్‌ ఆఫీస్‌ స్టాఫ్‌ అధికారుల బదిలీలను పూర్తిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు సీడీలుగా ఉన్న జిల్లాలో 261 మంది జూనియర్‌ అసిస్టెంట్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, ఆఫీస్‌ సూపరింటెండెంట్లను బదిలీ చేశారు. 

ఎక్సైజ్‌ నిబంధనల ప్రకారం వీళ్లను ఫోకల్‌ టు నాన్‌ ఫోకల్‌, యూనిట్‌ టు యూనిట్‌కు బదిలీ చేయాలి. ఏ పైరవీ లేని సాధారణ ఉద్యోగులను ఇవే నిబంధనతో బదిలీలు చేశారు. కానీ, ఉద్యోగ సంఘం నేతలకు, పైరవీకారులకు సడలింపు ఇచ్చారు. ఏకంగా ఎనిమిది ఏండ్ల నుంచి ఒకేచోట పనిచేస్తున్న ఎక్సైజ్‌ సంఘం నేతలకు తిరిగి అదే చోట పోస్టింగ్‌ ఇవ్వడం వివాదాస్పదమైంది. మరికొందరికి ఉద్యోగ సంఘం నేతలు సూచించిన చోట పోస్టింగ్‌ ఇచ్చారని ఎక్సైజ్‌ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కానిస్టేబుళ్ల బదిలీల్లో కఠినంగా వ్యవహరించిన ఆయన ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యారని ఆరా తీస్తే.. ఎక్సైజ్‌ ఉద్యోగలు ఆసక్తికర విషయం చెప్పారు. సాయం చేసిన వారికి కృతజ్ఞతగా … ఏప్రిల్‌లో ఎక్సైజ్‌ కానిస్టేబుళ్ల బదిలీలు జరిగాయి. ఆ సందర్భంలో నిజామాబాద్‌ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న సోమిరెడ్డిపై ఎక్సైజ్‌ కమిషనర్‌ తీవ్ర పదజాలంతో నోరు పారేసుకున్నారు.

ఈ ఘటనతో తీవ్ర మనోవేదనకు గురైన సోమిరెడ్డి ఎక్సైజ్‌ కార్యాలయంలోనే కుప్పకూలిపోయారు. సహచర ఉద్యోగులు హుటాహుటిన దవాఖానలో చేర్చడంతో ప్రాణాపాయం తప్పింది. అనంతరం ఆయన తనకు ఆత్మాభిమానం ముఖ్యమంటూ ఉద్యోగానికి రాజీనామా సమర్పించారు. ఈ నేపథ్యంలో సహచర ఉద్యోగికి జరిగిన అవమానాన్ని ఎక్సైజ్‌ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా పరిగణిస్తాయని, కమిషనర్‌ తీరును ఎక్సైజ్‌ ఉద్యోగ ఫోరాలు తప్పు పడుతాయని, బాధిత అధికారికి అండగా నిలబడి ఆయనకు మానసిక ధైర్యాన్ని ఇస్తారని అంతా ఆశించారు. కానీ, ఆశ్చర్యంగా ఒక్క ఎక్సైజ్‌ సంఘం కూడా బాధితుడికి అండగా నిలబడకపోవడం గమనార్హం. పైగా ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు ఉద్యమానికి సిద్ధమవుతున్న సమయంలో పూర్తిగా ఇది శాఖాపరమైన విషయమంటూ ఒక ఎక్సైజ్‌ ఉద్యోగ సంఘం నేత ప్రకటన విడుదల చేశారు. మరో సంఘం నేత కనీసం బాధితుడిని సంప్రదించకుండానే సమస్య సమిసిపోయిందని ప్రకటించారు. ఉద్యోగ సంఘం నేతల తీరుకు ఆందోళన చెందిన సోమిరెడ్డి దవాఖాన నుంచే ప్రకటన విడుదల చేస్తూ.. కమిషనర్‌ అవమానాలపై తనను సంప్రదించకుండానే సమస్య సమసిపోయిందని జేఏసీ నాయకులు ప్రకటన విడుదల చేయడం తనను మరింత బాధకు గురిచేసిందని పేర్కొన్నారు.


Smacy News 53 minutes ago
Home Flash News