ప్రైవేట్ ఉద్యోగులు సెలవు రోజు పని చేస్తే డబుల్ జీతం.. స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్‌కు గుడ్ న్యూస్
హైదరాబాద్: రాష్ట్ర కార్మిక రంగంలో చరిత్రాత్మక మార్పునకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని కార్మికులకు చేతికి నగదు (క్యాష్) రూపంలో జీతాలు ఇవ్వడాన్ని పూర్తిగా నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నది. మే 30న ప్రభుత్వం జారీ చేసిన జీవో 6 ప్రకారం.. ఇకపై ప్రైవేట్, కాంట్రాక్ట్, ఐటీ ఇలా ఏ రంగంలోనైనా సరే ప్రతి పైసా నేరుగా బ్యాంక్ అకౌంట్‌లో పడాల్సిందే.
ఈ చరిత్రాత్మక నిర్ణయంతోపాటు కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ..సెలవు రోజుల్లో పని చేస్తే డబుల్ జీతం ఇవ్వాలని ప్రభుత్వం రూల్ పెట్టింది. ఈ కొత్త జీవో ప్రకారం కంపెనీలు జీతాలు లెక్కించేటప్పుడు నెలలో 26 రోజులను మాత్రమే బేస్ చేసుకోవాలి. అంటే కార్మికులకు ఆదివారం వచ్చే వీక్లీ ఆఫ్ రోజుల్లో కూడా జీతం కట్ అవ్వకుండా, ఆ రోజుకు కూడా డబ్బులు కలిపి వస్తాయి. ఒకవేళ ఎవరైనా కార్మికుడు రోజుకు 8 గంటల కంటే ఎక్కువ పని చేసినా.. లేదా పబ్లిక్ హాలిడేస్, ఆదివారాల్లో డ్యూటీ చేసినా.. వారికి మామూలు రేటు కంటే రెండు రెట్లు (డబుల్) ఓవర్ టైమ్ డబ్బులు ఇవ్వాల్సిందే.
ఇక ఎక్కడైనా పాత వేతనాలు ఎక్కువగా ఉంటే.. వాటిని అలాగే ఉంచి, వాటిపై అదనంగా మరో 10 శాతం పెంచి ఇవ్వాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది. డ్రోన్లు నడిపేవారికి పండుగే.. డెలివరీ బాయ్స్‌కూ రక్షణ..! మన పొరుగున ఉన్న కర్నాటక, మహారాష్ట్రల కంటే తెలంగాణ ఈ విషయంలో ఎంతో ముందుంది. ఇప్పటివరకు చట్టాల పరిధిలోకిరాని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ కామర్స్ కొరియర్ సర్వీస్ బాయ్స్, స్విగ్గీ, జొమాటోలాంటి డెలివరీ బాయ్స్, గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే ‘గిగ్ వర్కర్స్’ అందరినీ ఈ కనీస వేతన చట్టం పరిధిలోకి తెచ్చి రక్షణ కల్పించింది. ఇక కొత్త టెక్నాలజీ అయిన డ్రోన్లతో పొలాల్లో మందులు చల్లేవారిని ‘హైలీ స్కిల్డ్’ (ఎక్కువ నైపుణ్యం ఉన్నవారు) కేటగిరీ కింద చేర్చి వారికి భారీ వేతనాలు ఖరారు చేసింది.