కృష్ణా, గోదావరిలో మన వాటా మనకు దక్కాల్సిందే!
హైదరాబాద్, వెలుగు: ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉన్నందున కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా జలాలను పక్కాగా సాధించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘ఎగువన ఉన్న కర్నాటక, మహారాష్ట్ర తమ డ్యామ్‌లు నిండిన తర్వాతే నీటిని కిందకు వదిలే విధానాన్ని పాటిస్తే మనకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఆయా రాష్ట్రాల్లోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున అంతర్రాష్ట్ర జలాలను ప్రొరేటా ప్రకారం డ్యామ్‌ల వారీగా విడుదల చేసేలా, ఆయా రాష్ట్రాల అధికారులతో ముందుగానే చర్చించి తగిన కార్యాచరణ రూపొందించాలి’’ అని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని సెక్రటేరియెట్‌లో వివిధ శాఖల ఆధ్వర్యంలో వర్షాకాల సన్నద్ధతపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వాతావరణ శాఖ అంచనాలు, నివేదికల ఆధారంగా పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
మహారాష్ట్రలోని కోయనా డ్యామ్ నీటిని ఆ రాష్ట్రం వంద శాతం జలవిద్యుత్ ఉత్పత్తికే వాడుకుంటోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ మొత్తం నీటిని మనం తీసుకొని, వారికి అవసరమైన విద్యుత్‌ను సరఫరా చేసే అంశంపై ఆ రాష్ట్ర అధికారులతో చర్చలు జరపాలని సీఎస్ రామకృష్ణారావును ఆదేశించారు. గోదావరి నది నుంచి ఏటా వేల టీఎంసీల జలాలు సముద్రం పాలవుతున్నాయని, కానీ ఆ వరదంతా చాలా స్వల్ప కాలంలోనే వస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇటు గోదావరి, అటు ప్రాణహితవైపు నుంచి వచ్చే వరదను ఎలా మళ్లించాలనే దానిపై స్పష్టమైన విధానం రూపొందించాలని సూచించారు. వీటితోపాటు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నిర్మించిన సీలేరు, తుంగభద్ర డ్యామ్‌ల నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌లో తెలంగాణకు రావాల్సిన వాటాపై స్పష్టమైన నివేదిక రూపొందించాలని విద్యుత్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.