Select Location
All Locations
State
Region
City / District
దీదీకి బిగ్ షాక్.. రెండుగా చీలిన TMC.. 58 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు..!

దీదీకి బిగ్ షాక్.. రెండుగా చీలిన TMC.. 58 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు..!

కోల్‎కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమాల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) రెండుగా చీలింది. 58 మంది ఎమ్మెల్యేలు దీదీకి వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగరేశారు. ఈ క్రమంలోనే రెబల్ ఎమ్మెల్యేలు బుధవారం (జూన్ 3) అసెంబ్లీ స్పీకర్‎ రతీంద్ర బోస్‌‎ను కలిసి టీఎంసీ బహిష్కృత నేత రీతబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించాలని లేఖ సమర్పించారు. ఈ లేఖపై స్పీకర్ సానుకూల నిర్ణయం తీసుకుంటే ఇది టీఎంసీకి భారీ ఎదురు దెబ్బే. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో ఢీలా పడ్డ దీదీకి ఈ ఊహించని పరిణామం మరింత ఇబ్బందికరంగా మారింది.

ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. 294 సీట్లకు గానూ కేవలం 80 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఎన్నికల అనంతరం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై సీనియర్ ఎమ్మెల్యేలు రీతబ్రత బెనర్జీ, సందీపన్ సాహాను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అభిషేక్ బెనర్జీ నాయకత్వాన్ని, అసెంబ్లీలో ఎల్వోపీ నియమాకాన్ని వీరు తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత ఇతర టీఎంసీ ఎమ్మెల్యేలతో రీతబ్రత బెనర్జీ సంప్రదింపులు జరిపారు. 58 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేతగా రీతబ్రత బెనర్జీకి మద్దతు తెలపడంతో టీఎంసీలో తిరుగుబాటు వర్గం ఏర్పడింది. అసెంబ్లీలో టీఎంసీకి 80 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. మూడింట రెండు వంతుల మార్కుకు 53 మంది ఎమ్మెల్యేలు అవసరం. తిరుగుబాటు వర్గానికి 58 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో వీరిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు. అయితే, తిరుగుబాటు ఎమ్మెల్యేలకు కొత్త పార్టీ పెట్టే యోచన లేదని తెలుస్తోంది. దీదీ నేతృత్వంలోనే పని చేస్తామని చెబుతున్నట్లు సమాచారం.


V6 News 3 hours ago
Home Flash News