Select Location
All Locations
State
Region
City / District
'మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు'.. వీధికుక్కల వ్యాఖ్యలపై స్పందించిన రాఘవ లారెన్స్‌

'మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు'.. వీధికుక్కల వ్యాఖ్యలపై స్పందించిన రాఘవ లారెన్స్‌

నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీశాయి. ఆయన సాధారణ ప్రజలను, విమర్శకులను ఉద్దేశించి 'కుక్కలు' అని సంబోధించారంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ విమర్శలపై ఆదివారం రాత్రి రాఘవ లారెన్స్ 'X' (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, తనను విమర్శించే ముందు పూర్తి వీడియోను చూడాలని ఆయన కోరారు. "నా అభిమానులు, ప్రజలు నాకు దేవుడితో సమానమని నేను ఎప్పుడూ చెబుతుంటాను. నేను ప్రజలను కుక్కలతో పోల్చానంటూ కొందరు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎంతమాత్రం నిజం లేదు" అని ఆయన స్పష్టం చేశారు.

రాఘవ లారెన్స్ ఆదివారం చెన్నైలోని తన రాఘవేంద్ర స్వామి ఆలయం వెలుపల అభిమానులు, మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం (తమిళగ వెట్రి కజగం - TVK) పరిపాలనపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. విజయ్ ప్రభుత్వ పాలన బాగుందని, అయితే కొత్తగా అధికారంలోకి వచ్చినందున కొన్ని సమస్యలు సహజమని చెప్తూ ఆయన ఒక ఉదాహరణను ఉపయోగించారు. "మనం ఒక కొత్త ఇంటికి మారినప్పుడు ఒకటి రెండు సార్లు చూసి వెళ్తాం. కానీ, అక్కడ నివసించడం ప్రారంభించినప్పుడే ఆ ఇంట్లో ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఆ ప్రాంతంలో ఉండే వీధి కుక్క కూడా మనల్ని చూసి మొరుగుతుంది. ఆ కుక్కకు మనతో అలవాటు కావడానికి బిస్కెట్లు లేదా కొన్నిసార్లు బిర్యానీ కూడా పెట్టాల్సి వస్తుంది. ఒక ఇల్లు, కుక్క విషయంలోనే అలా ఉంటే.. మీరు ఆయనకు ఒక రాష్ట్రాన్ని అప్పగించారు. కాబట్టి వారికి కొంత సమయం ఇవ్వండి. సానుకూలంగా ఆలోచించండి, మీరు కోరుకున్న మార్పు వచ్చింది, కాబట్టి వారికి సమయం ఇస్తే మంచి ఫలితాలు ఉంటాయి" అని లారెన్స్ వ్యాఖ్యానించారు.


Smacy News 1 hour ago
Home Flash News