NTR- Trivikram | ఎన్టీఆర్-త్రివిక్రమ్ చిత్రంపై ఒకవైపు భారీ బజ్ … మరోవైపు సరికొత్త వివాదాలు
NTR- Trivikram | టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందనున్న 'గాడ్ ఆఫ్ వార్' ఒకటి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'అరవింద సమేత వీరరాఘవ' ఘన విజయం సాధించడంతో, రెండోసారి ఈ కాంబోలో రానున్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి
NTR- Trivikram | టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో జూనియర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందనున్న ‘గాడ్ ఆఫ్ వార్’ ఒకటి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ ఘన విజయం సాధించడంతో, రెండోసారి ఈ కాంబోలో రానున్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారతీయ ఇతిహాసాల స్ఫూర్తితో రూపొందనున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తున్నారు. స్కంద పురాణంలోని కార్తికేయ స్వామి (సుబ్రహ్మణ్యస్వామి) గాథ ఆధారంగా ఈ కథను త్రివిక్రమ్ రూపొందిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో కథను మలుపు తిప్పే అత్యంత కీలక పాత్ర కోసం ఓ ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరోను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఆ పాత్రకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నటుడు అయితే సినిమాకు మరింత క్రేజ్ పెరుగుతుందని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, దైవిక నేపథ్యానికి తగ్గట్టుగా మరికొందరు ప్రముఖ నటీనటులు ప్రత్యేక పాత్రల్లో కనిపించే అవకాశం ఉందని కూడా ప్రచారం సాగుతోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్, ఎమోషనల్ కథనంతో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విజువల్ స్పెక్టాకిల్‌గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు త్రివిక్రమ్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఒకవైపు సినిమాపై అంచనాలు పెరుగుతుండగా, మరోవైపు ఈ ప్రాజెక్ట్ వివాదానికి కూడా కేంద్రంగా మారింది. తమిళనాడుకు చెందిన నామ్ తమిళర్ కట్చి (NTK) పార్టీ ప్రధాన నేత, దర్శకుడు సీమాన్ ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్తికేయుడు (మురుగన్) తమిళుల ఆది దైవమని, ఆయనకు సంబంధించిన చరిత్రను లేదా పురాణ నేపథ్యాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం జరిగితే అది అంగీకారయోగ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. కల్పిత కథనం పేరుతో దైవిక అంశాలను వక్రీకరించకూడదని, అలాంటి ప్రయత్నాలు చేస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని హెచ్చరించారు. అయితే, సీమాన్ చేసిన వ్యాఖ్యలపై చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. అలాగే బాలీవుడ్ స్టార్ నటిస్తున్నారనే వార్తపై కూడా ఎలాంటి ధృవీకరణ వెలువడలేదు. ప్రస్తుతం ఇవన్నీ సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారంగానే ఉన్నాయి.