బిడ్డకు జన్మనిచ్చిన 11 నెలలకే బరిలోకి.. డిస్కస్ త్రోలో సీమా కళిరామన్‌కు కాంస్యం
ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్ల పతకాల వేట కొనసాగుతోంది. మహిళల డిస్కస్ త్రో విభాగంలో సీమా కళిరామన్ కాంస్య పతకం సాధించింది. మూడో రౌండ్‌లో 58.65 మీటర్లు విసిరిన సీమా.. ఆ తర్వాత వరుసగా మూడుసార్లు ఫౌల్ అయింది. అయినా, కాంస్యం వరించింది. జమైకాకు చెందిన సమంత హాల్ (61.66 మీటర్లు), కెనడా అథ్లెట్ జులియా టంక్స్ (60.67 మీటర్లు) స్వర్ణ, రజత పతకాలను కైవసం చేసుకున్నారు. అయితే, కాంస్యం నెగ్గిన కళిరామన్ ప్రయాణం ప్రతి అథ్లెట్‌కు స్ఫూర్తిదాయకం.. ఇటు అమ్మతనం..
అటు చదువుల తల్లి హరియాణాకు చెందిన 27 ఏళ్ల సీమా కేవలం అథ్లెట్ మాత్రమే కాదండోయ్.. ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో పీహెచ్‌డీ చేసిన చదువుల తల్లి. చదువు, క్రీడలను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుండగా.. ఈలోగా కొత్త పాత్ర పోషించాల్సి వచ్చింది. అమ్మగా మారిన ఆమె కేవలం 11 నెలల వ్యవధిలోనే డిస్కస్ త్రో పోటీలకు సిద్ధమైంది. ఆమెకు కోచింగ్ ఇచ్చింది మరెవరో కాదు.. ఆమె భర్త రవీందర్. జాతీయ స్థాయిలో డిస్కస్ త్రో మాజీ అథ్లెట్ అయిన రవీందర్.. మోను కళిరామన్‌గా సుపరిచితుడు.