బీజేపీ అంటే భ్రష్ట్, జుల్మ్, పాప్.. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఫైర్
లక్నో: బీజేపీ అంటే 'భ్రష్ట్' (అవినీతి), 'జుల్మ్' (అణచివేత), 'పాప్' (పాపం) అని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న సమస్యలకు బీజేపీయే కారణమని, ఆ పార్టీ అధికారంలో నుంచి వెళ్లిపోతేనే ప్రజల సమస్యలు తీరుతాయని అన్నారు. ఆదివారం పార్టీ ఆఫీస్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. బీజేపీ హయాంలో నిర్మించిన లక్నో-కాన్పూర్, బుందేల్‌ఖండ్, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు.
రాష్ట్రంలోని చెరువులను భూ మాఫియా ఆక్రమించిందన్నారు. ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద నిరసన చేసిన యువతపై లాఠీచార్జ్ ఎందుకు చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులు అధికార పార్టీ ఒత్తిడితో అన్యాయంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌పైనా అఖిలేశ్ సెటైర్లు వేశారు. ప్రధానిని కూడా రీల్స్‌లో బిజీ చేయడం బాధాకరమన్నారు.
అలాగే 'రామ్ ధన్' పేరుతో సేకరించిన విరాళాల దుర్వినియోగంపై బీజేపీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హనుమంతుడిని అవమానించారని ఆరోపణలు వచ్చిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కూడా ప్రశ్నించారు. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే ఆలం బాడీ మృతికి పార్టీ నేతలు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.