యూపీఐ ట్రాన్సాక్షన్స్‌పై చార్జీలు!..ట్యాక్సేషన్ బిల్లులోని కీలకాంశాలివే..
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)తోపాటు ఇతర నోటిఫైడ్ ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానాలపై చార్జీలు విధించేందుకు బ్యాంకులకు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు అనుమతి లభించింది. యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధించే బిల్లు ఆమోదం పొందింది. ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ (అమెండ్‌మెంట్) బిల్ –2026 పేరిట రూపొందిన ఈ బిల్లును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగానే పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007 బిల్లు, ద ఇన్‌కం ట్యాక్స్ యాక్ట్ –2025 బిల్లు, ది ఫైనాన్స్ యాక్ట్–2026 బిల్లులకు సవరణలు చేశారు. అయోధ్య రాముడి గుడి విరాళాల చోరీ ఆరోపణలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు సభను హోరెత్తించడంతో, ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లును వాయిస్ ఓటుతో సభ ఆమోదించింది.
తర్వాత సభ మరుసటి రోజుకు వాయిదా పడింది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007 (సవరణ) ద్వారా ఇప్పటివరకూ యూపీఐ, ఇతర ఎలక్ట్రానిక్ పేమెంట్లపై వ్యాపారులకు బ్యాంకులు అందిస్తున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) రద్దవుతుంది. ఈ మేరకు పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం, 2007లోని సెక్షన్ 10ఏకు కీలక సవరణలు చేశారు. దీనివల్ల బ్యాంకులు, డిజిటల్ రంగానికి నిలకడైన ఆదాయ నమూనా అందుబాటులోకి రానున్నది. ‘ట్యాక్సేషన్ బిల్లు’ ద్వారా విదేశీ మూలధనాన్ని ఆకర్షించడం, ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించడంతోపాటు విదేశీ క్లౌడ్ కంపెనీలు భారత డేటా సెంటర్లను వాడుకునేలా నిబంధనలను స్పష్టం చేయడానికి వీలు కలుగుతుంది.
ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభ ఆమోదించిన 7వ బిల్లు ఇది. ఎలాంటి చర్చ లేకుండా ఆమోదం పొందిన 5వ బిల్లు కావడం గమనార్హం. జులై 20న ప్రారంభమైన ఈ సమావేశాల్లో గురువారంతో కలిపి వరుసగా 14వ రోజు కూడా ప్రశ్నోత్తరాల సమయం నిరసనల మధ్య కొట్టుకుపోయింది. ఆర్‌ఎస్‌పీ సభ్యుడు ఎన్.కె. ప్రేమచంద్రన్ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ మాట్లాడటానికి నిరాకరించడంతో స్పీకర్ బిల్లును ఓటింగ్‌కు ప్రాసెస్ చేసి, వాయిస్ ఓట్ ద్వారా ఆమోదించినట్టు ప్రకటించారు. అయోధ్య రామమందిరంలో విరాళాల చోరీ ఆరోపణలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు నిరంతరాయంగా నినాదాలు చేయడంతో సభను వాయిదా వేశారు.
2022-–23 ఆర్థిక సంవత్సరంలో జరిగిన సుమారు రూ. 54,067 కోట్ల అదనపు ఖర్చుల ఆమోదం కోసం ఉద్దేశించిన అప్రాప్రియేషన్ (నంబర్ 3) బిల్లు–2026 ను రాజ్యసభ ఆమోదించింది. అనంతరం బిల్లును లోక్‌సభకు తిరిగి పంపింది. వాయిస్ ఓట్ ద్వారా ఈ బిల్లుకు ఆమోదం లభించడంతో దీనికి సంబంధించిన పార్లమెంటరీ ప్రక్రియ పూర్తయింది. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా (భారత సంచిత నిధి) నుంచి ఈ నిధులను ఉపసంహరించుకోవడానికి బిల్లు వీలు కల్పిస్తుంది. ఈ బిల్లుపై జరిగిన చర్చకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ అదనపు నిధుల కేటాయింపునకు కారణాలను వెల్లడించారు. పీఏసీ 39వ నివేదిక ప్రకారం ఈ అదనపు వ్యయం రెండు పద్దులకే పరిమితమైంది. కోర్టు ఉత్తర్వుల కారణంగా రైల్వే శాఖకు రూ. 196.44 కోట్లు కేటాయించాల్సి వచ్చింది. మిగిలిన భారీ మొత్తం రూ. 53,871 కోట్లు రుణాల చెల్లింపునకు సంబంధించినది. సెక్యూరిటీల జారీకి ప్రతిగా ఇవి ఉన్నందున ప్రభుత్వ ఆర్థిక స్థితిపై ఎలాంటి ప్రభావం పడబోదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.