స్టాక్ మార్కెట్లో రక్తపాతం.. భారీ నష్టాల్లోకి జారుకున్న సూచీలు.. ఆ స్టాక్స్ లాభాల్లోకి..
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం తమ ప్రయాణాన్ని నష్టాలతో స్టార్ట్ చేశాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఇప్పుడు అనేక మధ్యప్రాశ్చ దేశాలతో పాటు యూరోపియన్ దేశాలకు కూడా విస్తరించటంతో ఇన్వెస్టర్లలో భయాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో మధ్యాహ్నం సమయానికి కీలక సూచీలు ఊహించని స్థాయిలకు దిగజారాయి.
మధ్యాహ్నం 12.25 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ 1450 పాయింట్ల నష్టంతో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 443 పాయింట్లు కోల్పోయింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ సూచీ 1500 పాయింట్లకు పైగా కోల్పోయి ముందుకు సాగుతోంది. ఇక బ్యాంక్ నిఫ్టీ , నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు కూడా భారీగానే నష్టాలతో ముందుకు సాగుతున్నాయి.
యుద్ధం వేళ మార్కెట్లో ట్రావెల్ అండ్ టూరిజం పరిశ్రమకు చెందిన షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఇండిగో, ఇక్సిగో, ఆర్వీఎన్ఎల్, విమానయానం, హోటల్స్, టూరిజం కంపెనీల షేర్లు పతనం అయ్యాయి. ఈ క్రమంలో మార్కెట్లో ఎల్ అండ్ టి, ఇండిగో, అదానీ పోర్ట్స్ కంపెనీల షేర్లు ఇంట్రాడేలో భారీ నష్టాలను నమోదు చేశాయి. ఇదే క్రమంలో డిఫెన్స్ రంగానికి చెందిన కంపెనీల షేర్లు ఒక్కసారిగా లాభపడ్డాయి. నిఫ్టీ డిఫెన్స్ 2 శాతం మేర లాభపడింది. భెల్, పరాస్ డిఫెన్స్ సహా మరిన్ని కంపెనీలు లాభపడ్డాయి.