ట్రాఫిక్ కెమెరాలు ట్రాక్ చేసి.. ఫోన్ నెట్‌వర్క్‌పై నిఘా పెట్టి: ఇజ్రాయెల్ అటాక్ ప్లాన్
ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా-ఇజ్రాయెల్ (Israel-USA) దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ (Ayatollah Ali Khamenei) మృతి చెందడం సంచలనం సృష్టించింది. కొన్నేళ్లక్రితమే సుప్రీంలీడర్‌ను తమ టార్గెట్‌లో పెట్టుకొన్న ఇజ్రాయెల్.. ఆయన కదలికలను పసిగట్టేందుకు ఇరాన్ (Iran)) ట్రాఫిక్ కెమెరా నెట్‌వర్క్, మొబైల్ ఫోన్ సిస్టమ్స్‌ను హ్యాక్ చేసిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. రాజధాని నగరం టెహ్రాన్‌లోని అన్ని ట్రాఫిక్ కెమెరాలు ఏళ్లపాటు హ్యాకింగ్‌కు గురయ్యాయని ఇజ్రాయెల్ నిఘా విభాగంలో పనిచేసిన అధికారులు వెల్లడించారు. ఆ ఫుటేజీని ఎప్పటికప్పుడు ఎన్‌క్రిప్ట్ చేసి, స్వదేశానికి తెప్పించుకున్నట్లు పేర్కొన్నారు.
సుప్రీం లీడర్ ప్రతి కదలికను ట్రాక్ చేసి..
టెహ్రాన్‌లో సుప్రీంలీడర్ కాంపౌండ్‌లో రోజూవారీ కార్యకలాపాలు, ఆయన భద్రతా సిబ్బంది వాహనాల పార్కింగ్ గురించి ఎప్పటికప్పుడు నెతన్యాహు ప్రభుత్వం పర్యవేక్షించేందని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ‘‘ఖమేనీ ఎక్కడ ఉంటారు..? ఎవరిని కలుస్తున్నారు..? ఇతరులతో ఎలా కమ్యూనికేట్ అవుతారు..? తన ప్రాణానికి ఏదైనా హాని ఉంటే ఎక్కడికి వెళ్తారు..?’’ ఇలా ప్రతి విషయాన్ని యూఎస్, ఇజ్రాయెల్ (Israel) నిఘా వర్గాలు సునిశితంగా అధ్యయనం చేశాయని వెల్లడించాయి. ఆయనతో సమావేశమయ్యే రాజకీయ, మిలిటరీ ఉన్నతాధికారుల్ని కూడా ట్రాక్ చేసినట్లు తెలుస్తోంది.
‘‘మాకు జెరూసలెం గురించి ఎంత తెలుసో.. టెహ్రాన్ గురించి కూడా అంతే బాగా తెలుసు’’ అని ఆ వర్గాలు పేర్కొనడం గమనార్హం. ఎప్పటికప్పుడు సేకరించిన సమాచారాన్ని ఒక క్రమంలోకి తీసుకువచ్చేందుకు ఇజ్రాయెల్ ఏఐ టూల్స్, అల్గారిథమ్స్‌ను ఉపయోగించిందట. ఇక, ఈ ఫిబ్రవరి 28న కూడా అత్యంత కచ్చితత్వంతో ఖమేనీని టార్గెట్ చేయడానికి ఈ డేటానే ఉపయోగపడింది.
ఇరాన్‌లో ప్రతి శుక్రవారం ప్రభుత్వ సెలవుదినం. ఖమేనీ ప్రతీ వారం ప్రారంభం రోజున (శనివారం) తన అధికారిక నివాసంలో కీలక ప్రభుత్వ పెద్దలు, సైనిక ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించేవారు. టెహ్రాన్ నగర నడిబొడ్డులోని ఒక ప్రభుత్వ ప్రాంగణంలో ఇరాన్ అత్యున్నత స్థాయి అధికారుల సమావేశం ఉంటుందని ఇజ్రాయెల్ తెలుసుకొని దాడి చేసింది. ఈ వ్యవహారంలో అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఇచ్చిన సమాచారం కూడా కీలకమైంది.