ABP Desam Smart Ed Conclave 2026: స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్ వేవ్ సీఈవో రాహుల్!
ABP Desam Smart Ed Conclave 2026: వేగంగా మారుతున్న సాంకేతికతను క్యాచ్ చేస్తూ స్కిల్ పెంచుకున్న వాళ్లకే ఎక్కువ అవకాశాలు ఉంటాయని నెక్ట్స్ వేవ్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు రాహుల్ అత్తులూరి అభిప్రాయపడ్డారు.
ABP Desam Smart Ed Conclave 2026: నేటి ఆధునిక విద్యా వ్యవస్థ కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా, కెరీర్ ఎదుగుదల, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేయడం, వాస్తవిక ప్రపంచంలో విజయం సాధించడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నెక్ట్స్ వేవ్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు రాహుల్ అత్తులూరి స్పష్టం చేశారు. ఏబీపీ దేశం స్మార్ట్ ఎడ్ కాంక్లేవ్2026 వేదికగా జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని మారుతున్న సాంకేతిక ప్రపంచంలో విద్యార్థులు, ముఖ్యంగా టైర్ 2, 3 పట్టణాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలపై విశ్లేషణాత్మక ప్రసంగం చేశారు.
నిరుద్యోగం నుంచి ఎంఎస్‌సీ కొలువుల వరకు
రాహుల్ తన నేపథ్యాన్ని వివరిస్తూ ఐఐటీ హైదరాబాద్‌లో కంప్యూర్ సైన్స్ పూర్తి చేసిన తర్వాత పారిశ్రామికవేత్తగా మారాలనే లక్ష్యంతో అమెజాన్ వంటి దిగ్గజ సంస్థల్లో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పని చేశారు. తన సొంత సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ కోసం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను నియమించుకోవాల్సిన సమయంలో, టైర్ 2, టైర్ 3 కాలేజీల్లోని విద్యార్థుల నైపుణ్యాలకు, ఐఐటీ/ట్రిపుల్ ఐటీ విద్యార్థుల నైపుణ్యాలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఆయన గమనించారు.