రూ.16వేల కోట్లతోనే మూసీ సుందరీకరణ పనులు చేయొచ్చు: కేటీఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు హద్దే లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. పేదల ఇళ్లు కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని నాగోల్‌లో సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
‘‘రూ.1.50 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ పనులు చేస్తామని సీఎం రేవంత్ చెబుతున్నారు. రూ.16వేల కోట్లతోనే ఆ పనులను చేయొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించింది హామీల అమలు కోసమే. రెండున్నరేళ్లలో ఒక్క ఇల్లు నిర్మించినట్లు చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటా. మూసీ సుందరీకరణ పనుల బాధ్యత మాకు అప్పగిస్తే రూ.16వేల కోట్లకే చేసి చూపిస్తాం. ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా అభివృద్ధి చేస్తాం’’అని కేటీఆర్ అన్నారు.