మరోసారి ఉద్యోగులను లేఆఫ్ చేసిన అమెజాన్.. ఆ విభాగంలో వారికి పింక్ స్లిప్స్..
టెక్ దిగ్గజం అమెజాన్ మరోసారి లేఆఫ్స్ బాట పట్టింది. ఈసారి సంస్థలోని అత్యంత కీలకమైన, భవిష్యత్ సాంకేతికతగా భావించే 'రోబోటిక్స్' విభాగంపై వేటు పడింది. ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన అమెజాన్.. తాజాగా మరికొందరికి పింక్ స్లిప్స్ జారీ చేయటం ఉద్యోగుల్లో ఆందోళనలు పెంచేస్తోంది.
అమెజాన్ తన రోబోటిక్స్ విభాగంలో కనీసం 100 మందికి పైగా ఉన్నత స్థాయి ఉద్యోగులకు పింక్ స్లిప్స్ జారీ చేసింది. అమెజాన్ గోదాముల్లో వస్తువులను ప్యాక్ చేసి తరలించే ఆటోమేటెడ్ వ్యవస్థలను ఈ డివిజన్ రూపొందిస్తుంది. ఈ తొలగింపులను అమెజాన్ అధికారికంగా ధృవీకరించింది. సంస్థలో ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి, కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని అమెజాన్ చెబుతోంది.
బ్లూజే ప్రాజెక్ట్ నిలిపివేత:
తాజా లేఆఫ్స్ వెనుక ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. అమెజాన్ ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'బ్లూ జే' అనే రోబోటిక్ ఆర్మ్ ప్రాజెక్టును అర్ధాంతరంగా నిలిపివేసింది. గోదాముల్లో మనుషులతో కలిసి పని చేసేలా రూపొందించిన ఈ రోబోట్ పనితీరులో కొన్ని లోపాలు ఉండటం, అలాగే ఖర్చులు పెరగడంతో దీన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్న ఉద్యోగులనే ఇప్పుడు కంపెనీ ఇంటికి పంపిస్తోంది.