Rythu Bharosa | రైతుభరోసా ఇచ్చినం.. అందరికి వచ్చిందో లేదో తెల్వదు.. సీఎం రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Rythu Bharosa | హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): రైతులకు రైతుభరోసా అమలు చేసినట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అయితే, అందరికీ వచ్చిందా? రాలేదా? అనే విషయం తనకు తెలియదని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ ఏర్పాటుచేసిన ధన్యవాద సభకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.Geographic Reference
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ‘రైతు రుణమాఫీ చేసినం, రైతుభరోసా అమలు చేసినం. అందరికీ వచ్చిందా? రాలేదా? అంటే నాకు తెలియదు.. మీరిచ్చిన సమాచారమే నా వద్ద ఉన్నది’ అని వ్యాఖ్యానించారు. వాస్తవానికి, యాసంగికి ఇవ్వాల్సిన రైతుభరోసా పెట్టుబడి సాయం ప్రభుత్వం ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. అయినప్పటికీ, లక్షలాది మంది రైతులు ఎదురుచూస్తున్న రైతుభరోసా నిధులు ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్పారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందరికీ వచ్చిందో రాలేదో తనకు తెలియదంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
హోటళ్లు, కూరగాయల షాపులతో యువతకు ఉపాధి కల్పిస్తాం
కొత్వాల్‌గూడ వద్ద ఎకో హిల్‌పార్క్ ప్రారంభించిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరుద్యోగులు, యువతను అవమానించేలా, కించపరిచేలా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మూసీ నది ఒడ్డుకు ఇరువైపులా కూరగాయల షాపులు, హోటళ్లు, వంటల దుకాణాలు, ట్యాక్సీలు ఏర్పాటు చేయడం వల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. మూసీ అభివృద్ధికి సంబంధించి అంశాలపై మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
‘మూసీ నది రివర్‌ఫ్రంట్ అభివృద్ధి చేసుకొని.. బ్రహ్మాండంగా లైట్లు పెట్టి… రాత్రి పూట నది ఒడ్డున రెండువైపులా హోటళ్లు, కూరగాయల దుకాణాలు, వంటలు, ట్యాక్సీల ఏర్పాటు ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి, శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేస్తాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పగటి పూటే కాదు.. రాత్రి పూట కూడా ఆదాయం వచ్చేలా నైట్ టూరిజం డెవలప్‌మెంట్ చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి తన వ్యాఖ్యలతో తమను అవమానించారని నిరుద్యోగ యువత మండిపడుతున్నారు. అధికారంలోకి వస్తే తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చి, ఇప్పుడేమో కూరగాయల షాపులు, హోటళ్లతో ఉపాధి కల్పిస్తామని చెప్పడమేమిటని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ చేసిన మోసానికి, సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అవమానానికి బదులు తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు.