RCB New Owner: ఆర్సీబీకి హ్యాండిచ్చిన మాంచెస్టర్ యునైటెడ్.. కొత్త ఓనర్‌గా రాజస్థాన్ మాజీ ప్లేయర్..!
Royal Challengers Bengaluru: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకు బిగ్ న్యూస్ అందింది. గతేడాది ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు ఇప్పుడు కొత్త యాజమాన్యం చేతుల్లోకి మారింది. గత యజమానులు యునైటెడ్ స్పిరిట్స్ ఈ జట్టును విక్రయించగా, దిగ్గజ పారిశ్రామిక సంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్ దీనిని దక్కించుకోవడం విశేషం. దీంతో ఆర్సీబీ ప్రస్థానంలో కొత్త అధ్యాయం మొదలైంది.
RCB New Owner: గత ఏడాది ఐపీఎల్ 2025 విజేతగా నిలిచిన కొద్ది నెలలకే యునైటెడ్ స్పిరిట్స్ సంస్థ ఆర్సీబీ ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టింది. తాజాగా ఆదిత్య బిర్లా గ్రూప్, అమెరికా క్రీడా పెట్టుబడిదారు డేవిడ్ బ్లిట్జర్, బ్లాక్‌స్టోన్ సంస్థల కూటమి ఈ జట్టును కొనుగోలు చేసింది.
ఈ వారంతంలో ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో ఈ యాజమాన్య మార్పు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొదట రాజస్థాన్ రాయల్స్ జట్టుపై ఆసక్తి చూపిన ఈ కూటమి, చివరి నిమిషంలో బెంగళూరు జట్టును దక్కించుకోవడానికి మొగ్గు చూపింది.
ఆర్సీబీని దక్కించుకోవడానికి అంతర్జాతీయ స్థాయిలో భారీ పోటీ నెలకొంది. ప్రసిద్ధ ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ సహ యజమాని అవ్రామ్ గ్లేజర్ కూడా ఈ రేసులో నిలిచారు. అలాగే ప్రముఖ వ్యాపారవేత్త అదర్ పూనావాలా కూడా జట్టు కొనుగోలుకు ఆసక్తి చూపినప్పటికీ, చివరికి ఆదిత్య బిర్లా కూటమి పైచేయి సాధించింది. కుమార్ మంగళం బిర్లా కుమారుడు ఆర్యమాన్ బిర్లా ఈ ఫ్రాంచైజీ బాధ్యతలను ముందుండి నడిపించే అవకాశం ఉంది. ఆర్యమాన్ గతంలో రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఆటగాడిగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా మాట్లాడుతూ, ఐపీఎల్ అనేది అంతర్జాతీయ క్రీడా ప్రపంచంలో ఒక శక్తివంతమైన వేదిక అని కొనియాడారు. ఆర్సీబీ వంటి ప్రతిష్టాత్మక జట్టుకు సంరక్షకులుగా మారడం తమకు గర్వకారణమని, ఈ జట్టు వారసత్వాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2008 నుంచి జట్టును నడిపించిన యునైటెడ్ స్పిరిట్స్ స్థానంలో ఇప్పుడు బిర్లా గ్రూప్ బాధ్యతలు చేపట్టనుంది.
రజత్ పాటిదార్ సారథ్యంలో గత ఏడాది పంజాబ్ కింగ్స్‌ను ఓడించి తొలిసారి ట్రోఫీని గెలుచుకున్న ఆర్సీబీ, ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. మార్చి 28వ తేదీ శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే తొలి పోరుతో ఈ సీజన్ ప్రారంభం కానుంది. కొత్త యాజమాన్యం, పాత ఉత్సాహంతో ఆర్సీబీ తన టైటిల్ వేటను మొదలుపెట్టనుంది.