భద్రాచలంలో శ్రీరామ నవమికి పటిష్ట బందోబస్తు : ఎస్పీ బి.రోహిత్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాచలంలో జరిగే శ్రీరామ నవమి, సీతారామచంద్రస్వామి పట్టాభిషేకం వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2వేల మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ బి.రోహిత్ రాజు తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే వేడుకల్లో భక్తుల సౌకర్యార్థం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్యూ ఆర్‌కోడ్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
పార్కింగ్, లడ్డూ, ప్రసాదాల కౌంటర్లు, కల్యాణ మండపం, సెక్టార్లు, తలంబ్రాల కౌంటర్లకు ఈజీగా చేరుకునేందుకు ఈ క్యూర్ కోడ్ ఉపయోగపడుతుందన్నారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు చేపడ్తున్నామన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
మూడు రోజులు స్పెషల్ హెల్త్ క్యాంప్స్..
భద్రాచలంలో జరిగే శ్రీరామ నవమి మహోత్సవాల సందర్భంగా మూడు రోజుల స్పెషల్ హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నట్టు డీఎంహెచ్‌వో తుకారాం రాథోడ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ శ్రీరామ నవమి, సీఎం పర్యటన సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ తరఫున చేపట్టనున్న కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో స్పెషల్ హెల్త్ క్యాంపులు పెడ్తున్నామని, 200 మంది డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవలందించనున్నట్లు చెప్పారు.
30 మంది డాక్టర్లు నిరంతరం డ్యూటీల్లో ఉంటారని, వీవీఐపీల కోసం రెండు ప్రత్యేక హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భద్రాచలం ఏరియా హాస్పటల్లో 50 బెడ్స్‌తో పాటు ప్రైవేట్ హాస్పటళ్లలో పది బెడ్స్‌ను అత్యవసర సమయాల్లో ఉపయోగించేందుకు సిద్ధంగా ఉంచుతున్నామన్నారు. భక్తులకు ఆశా వర్కర్ల ద్వారా ఓఆర్ఎస్ ను పంపిణీ చేయనున్నామన్నారు.