700 మందికి మెటా లేఆఫ్‌లు.. వారికి రూ.8,600 కోట్లు..!
ఇంటర్నెట్ డెస్క్: కృత్రిమ మేధ రాకతో టెక్ రంగంలోని ఉద్యోగులకు లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా 700 మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించింది (Meta Layoffs). అయితే, ఈ లేఆఫ్‌లకు కొన్ని గంటల ముందే టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు కంపెనీ కొత్త స్టాక్ ఆప్షన్లు ప్రకటించడం చర్చనీయాంశమైంది.
రియాల్టీ ల్యాబ్స్, సేల్స్, రిక్రూటింగ్, ఫేస్‌బుక్ విభాగాల నుంచి 700 మందికి పైగా ఉద్యోగులకు మెటా (Meta) ఉద్వాసన పలికింది. ఈ మేరకు కంపెనీ విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. రియాల్టీ ల్యాబ్స్ డివిజన్‌లో కంపెనీ లేఆఫ్‌లు ప్రకటించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ ఏడాది జనవరిలో ఈ విభాగం నుంచి 1000 మందిని మెటా తొలగించింది.
ఏఐ (Artificial Intelligence)లో పెట్టుబడులు పెంచుతోన్న నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యలో కోత పెట్టాలని మెటా (Meta) భావిస్తోంది. ఇందులోభాగంగా ఈ ఏడాది దాదాపు 16 వేల మందికి లేఆఫ్‌లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇందులోభాగంగానే తాజాగా తొలగింపులు చేపట్టినట్లు సమాచారం. అయితే, లేఆఫ్‌లు ఎదుర్కొన్నవారిలో కొందరికి కంపెనీలోనే ఇతర విభాగాల్లో ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
ఓవైపు, సిబ్బంది సంఖ్యను తగ్గించుకుంటోన్న మెటా.. టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు కొత్త ప్రోత్సాహకాలు కల్పిస్తోంది. లేఆఫ్‌ల ప్రకటనకు ఒకరోజు ముందే తమ కీలక ఎగ్జిక్యూటివ్‌లకు కొత్త స్టాక్ ఆప్షన్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ఈ స్కీమ్‌తో కొంతమంది సీనియర్ ఉద్యోగులకు వచ్చే ఐదేళ్లలో వేతన పరిహారం దాదాపు 921 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.8,600 కోట్లు) మేర పెరగనుంది. ఏఐ శకంలో అత్యున్నత నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు సంస్థను వీడకుండా ఉండేందుకు ఈ ప్రోత్సాహకాలు ప్రకటించినట్లు మెటా వర్గాలు వెల్లడించాయి.
ఇదిలాఉండగా, సోషల్ మీడియా అడిక్షన్ కేసులో మెటా, యూట్యూబ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ ప్లాట్‌ఫామ్‌ల డిజైన్ కారణంగా ఓ యువతి సామాజిక మాధ్యమాలకు బానిసైందని, దానివల్ల ఆమె మానసిక ఆరోగ్యం దెబ్బతిందన్న ఆరోపణలపై నమోదైన కేసులో కాలిఫోర్నియా కేసు తాజాగా తీర్పునిచ్చింది. ఈ కేసులో మెటా, యూట్యూబ్ నిర్లక్ష్యంగా వ్యవహరించాయని కోర్టు నిర్ధరించింది. ఇందుకుగానూ 6 మిలియన్ డాలర్లు జరిమానా విధించింది. ఇందులో 70శాతం మెటా, 30 శాతం యూట్యూబ్ చెల్లించాలని ఆదేశించింది.