అనిశ్చితి వేళ విశాఖకు క్రూడాయిల్, ఎల్‌పీజీ షిప్‌లు
సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో అనిశ్చితి, ఎర్రసముద్రం, గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతల వల్ల షిప్పింగ్ రంగంలో ఆందోళన నెలకొన్న తరుణంలో విశాఖపట్నం పోర్టుకు భారీ ఇంధన నౌకలు చేరుకోవడం సానుకూల పరిణామంగా మారింది. నగరంలోని రిఫైనరీలకు, పరిశ్రమలకు, సామాన్య ప్రజల గృహ అవసరాలకు అవసరమైన ఎల్‌పీజీ, పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు ఇప్పుడు పుష్కలంగా అందుబాటులోకి రానున్నాయి. ప్రధానంగా ఈ నెల 20న గుజరాత్ తీరం నుంచి బయలుదేరిన రెండు కీలక స్వదేశీ ఫ్లాగ్ వెసెల్స్ విశాఖ తీరానికి గురువారం సాయంత్రం చేరుకున్నాయి.
ఖతార్‌లోని మెసయ్యద్ పోర్టు నుంచి బయలుదేరి గుజరాత్‌లోని వాడినార్ పోర్టులో లోడింగ్ పూర్తి చేసుకున్న బీడబ్ల్యూ బిర్చ్ అనే భారీ ఎల్‌పీజీ ట్యాంకర్ విశాఖ వచ్చింది. సుమారు 58,123 టన్నుల సామర్థ్యం గల ఈ నౌక ప్రస్తుతం 11.6 మీటర్ల పూర్తిస్థాయి లోడుతో పోర్టుకు చేరుకుంది. సౌత్ ఏసియా ఎల్‌పీజీ కావెర్న్ లేదా హెచ్‌పీసీఎల్ టెరి్మనల్ వద్ద అన్‌లోడింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. అదేవిధంగా రష్యా నుంచి గుజరాత్‌లోని ముంద్రా పోర్టు మీదుగా బయలుదేరిన ఎంటీ పేట్రియాట్ ఆయిల్ ట్యాంకర్ కూడా విశాఖ పోర్టులోకి ప్రవేశించింది.
ఈ నౌకలో సుమారు 46,001 టన్నుల పెట్రోలియం ఉత్పత్తులు (ప్రధానంగా హై – స్పీడ్ డీజిల్) ఉన్నట్లు సమాచారం. ఈ వెసెల్ విశాఖలోని అవుటర్ హార్బర్ ఆయిల్ టెరి్మనల్ వద్ద బెర్తింగ్ చేయనున్నారు. ఇక్కడ నుంచి పైప్‌లైన్ ద్వారా హెచ్‌పీసీఎల్ లేదా ఐఓసీఎల్ రిఫైనరీ టెరి్మనల్స్‌కు తరలించనున్నారు. వీటిరాకతో విశాఖతోపాటు ఇతర జిల్లాలకు కొంత కాలంపాటు వంటగ్యాస్, ఇంధన సమస్యలు తలెత్తబోవని భావిస్తున్నారు.