‘బాబు’ విజనరీని ఛీకొట్టిన కేంద్రం
సాక్షి, విశాఖపట్నం : విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు ఇప్పుడు ఆ ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేశాయి. గత ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రణాళికలను పక్కనపెట్టి, కేవలం తన మార్కు కనిపించాలన్న తాపత్రయంతో చంద్రబాబు ప్రవేశపెట్టిన ‘డబుల్ డెక్కర్’ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రిత్వ శాఖలు గట్టి షాక్ ఇచ్చాయి. కొత్తగా పంపిన డీపీఆర్‌ను కేంద్రం వెనక్కి పంపడంతో విశాఖ వాసుల మెట్రో కల మళ్లీ మొదటికి వచ్చింది. వాస్తవానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విశాఖ అభివృద్ధిని కాంక్షిస్తూ 76 కిలోమీటర్ల మేర 4 కారిడార్లతో లైట్ మెట్రో ప్రాజెక్టుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. రూ. 14,309 కోట్ల అంచనా వ్యయంతో, పీపీపీ విధానంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2023 డిసెంబర్ 29న ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.
అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, విదేశీ డిజైన్లు, డబుల్ డెక్కర్ కారిడార్లంటూ ‘విజనరీ’ పేరుతో కొత్త డీపీఆర్‌ను రూపొందించారు. కేవలం 8 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ కారిడార్ కోసం పూర్తిస్థాయిలో ఉన్న పాత డీపీఆర్‌ను మార్చేయడం ఇప్పుడు విమర్శలకు దారితీసింది. ఈ కొత్త ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం ‘డబుల్ డెక్కర్ వస్తే ఇక మెట్రోతో పనేముంది?’ అని ప్రశి్నస్తూ డీపీఆర్‌ను తిరస్కరించింది. ‘ఇదేం డీపీఆర్ బాబూ?’ అంటూ కేంద్రం అసహనం వ్యక్తం చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
కేంద్ర మంత్రిత్వ శాఖల విశ్లేషణ ప్రకారం.. డబుల్ డెక్కర్ కారిడార్ వల్ల నిర్మాణ సమయం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా, ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ సాంద్రత, భూసేకరణ సమస్యలు ఈ కొత్త ప్రతిపాదనతో మరింత జటిలమవుతాయి. ఈ నేపథ్యంలో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ డబుల్ డెక్కర్ ప్రతిపాదనను తొలగించి, పాత పద్ధతిలోనే సాధ్యమయ్యే రీతిలో మరోసారి కొత్త డీపీఆర్ తయారు చేయాలని తేల్చి చెప్పింది. దీనివల్ల నెలల తరబడి కష్టపడి చేసిన కసరత్తు అంతా బూడిదలో పోసిన పన్నీరైంది.
మొత్తానికి విశాఖ మెట్రో కథ ఇప్పుడు ‘మళ్లీ మొదటికి’ అన్నట్లు తయారైంది. కేంద్రం ఆదేశాల మేరకు కొత్త డీపీఆర్ తయారు చేయాలంటే మళ్లీ కొన్ని నెలల సమయం పడుతుంది. అప్పటివరకు నిధుల కేటాయింపు, టెండర్ల ప్రక్రియ ఆగిపోవాల్సిందే. ప్రభుత్వాల ప్రాధాన్యతలు మారినప్పుడల్లా ఇలా ప్రాజెక్టు నివేదికలు మారిపోతే, సామాన్యుడికి మెట్రో ప్రయాణం ఎప్పటికీ ఒక కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.