గ్యాస్, పెట్రోల్ కొరత.. ఇక ‘కిరోసిన్’ పంపిణీ
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియా ఉద్రిక్తతలు మన వంట గదిలోనూ మంట పెట్టాయి. హర్మూజ్ జలసంధిలో చమురు రవాణాకు అంతరాయం ఏర్పడటంతో దేశంలో గ్యాస్, ఇంధనాల కొరత నానాటికీ తీవ్రమవుతోంది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ (LPG Cylinder) సమస్య తగ్గించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అన్ని రాష్ట్రాలకు సుపీరియర్ కిరోసిన్ (Kerosene) పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు చమురు మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. కేవలం వంట, దీపాలు వెలిగించడం కోసమే షరతులకు లోబడి ఈ పంపిణీని చేపట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో పాటు లైసెన్స్ పొందిన సర్వీస్ స్టేషన్‌లలో 2,500 లీటర్ల వరకు కిరోసిన్ నిల్వ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. 60 రోజుల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని కేంద్రం తెలిపింది.
సుపీరియర్ కిరోసిన్ అయిల్ అనేది ముడిచమురు రిఫైనరీ ప్రక్రియ నుంచి వచ్చే ఉప ఉత్పత్తి. ఇది అత్యంత శుద్ధి చేసిన కిరోసిన్. దీన్ని ప్రధానంగా వంటకు, దీపాలు వెలిగించేందుకు వినియోగిస్తారు. సాధారణ లో-గ్రేడ్ కిరోసిన్‌తో పోలిస్తే ఇందులోనుంచి వెలువడే వాయువులు తక్కువ. పొగ కూడా తక్కువగా వెలువడుతుంది.