ఖర్గ్‌ను అమెరికా స్వాధీనం చేసుకోవచ్చు: ట్రంప్
ఇంటర్నెట్‌డెస్క్: ఇరాన్ (Iran) ఆర్థిక జీవనాడి అయిన ఖర్గ్ ద్వీపాన్ని (Kharg Island) స్వాధీనం చేసుకోవచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఆయన ఆంగ్ల పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘మేము ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవచ్చు.. చేసుకోకపోవచ్చు. మా ఎదుట చాలా ఆప్షన్లు ఉన్నాయి. కొన్నాళ్లు ఆ ద్వీపాన్ని మా అధీనంలో ఉంచుకోవచ్చు కూడా. ఇరాన్ వద్ద ఆత్మరక్షణకు మరేమీ మిగిలిందని అనుకోవడం లేదు. ఒక్కసారి మేము దాడి మొదలుపెట్టాక.. దానిని చాలా తేలిగ్గా స్వాధీనం చేసుకొంటాం’’ అని దీమా వ్యక్తంచేశారు. అయితే ఇరాన్‌తో ఒప్పందం కుదురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. గ్రౌండ్ ఆపరేషన్ చిట్టచివరి ఆప్షన్‌గా పేర్కొన్నారు.
అంతేకాదు.. ఇరాన్ హర్మూజ్‌లో టోలు వసూలుచేస్తున్నట్లు వచ్చిన వార్తల పైనా ట్రంప్ స్పందించారు. అదే నిజమైతే అమెరికా దానిని రెండు నిమిషాల్లో మూసేయిస్తాయని భరోసా ఇచ్చారు. సౌదీ, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్ దేశాలు ఇరాన్‌పై తిరగబడుతున్నాయన్నారు.
ఇక అమెరికా యుద్ధనౌక యూఎస్‌ఎస్ ట్రిపోలి దాదాపు 3,500 మంది మెరైన్లతో పశ్చిమాసియాకు చేరుకొంది. ఇది ఈనెల 27న తమ సెంట్రల్ కమాండ్ పరిధిలోకి వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు. యూఎస్‌ఎస్ ట్రిపోలిపై ఎఫ్-31లు సహా పలు యుద్ధ విమానాలను మోహరించవచ్చు. యూఎస్‌ఎస్ బాక్సర్‌తోపాటు శాన్‌డిగో నుంచి వచ్చిన ఇతర నౌకాదళ యూనిట్లు, అదనపు బలగాలూ పశ్చిమాసియాకు చేరుకున్నాయి.