Iran:నేడు ఇరాన్ నావికాదళ అధిపతి తంగ్సిరి అంత్యక్రియలు
Iran:ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నావికాదళ కమాండర్ రియర్ అడ్మిరల్ అలీరెజా తంగ్సిరి అంత్యక్రియలు నేడు ఖుజెస్తాన్ ప్రావిన్స్‌లోని అబాదాన్ నగరంలో నిర్వహించనున్నారు. అబాదాన్ స్క్వేర్‌లో అంతిమ నివాళులు అర్పించిన అనంతరం, నగర స్మశానవాటికలో ఆయనను ఖననం చేయనున్నారు. తంగ్సిరి మరణం దేశవ్యాప్తంగా విషాదాన్ని కలిగించగా, ఆయనకు గౌరవార్థం భారీ స్థాయిలో ప్రజలు హాజరవుతారని అధికారులు తెలిపారు.
గత బుధవారం రాత్రి జరిగిన వైమానిక దాడిలో తంగ్సిరి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అతడిని ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ.. మరణించినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ దాడిలో మరికొంత మంది సీనియర్ నావికాదళ అధికారులు కూడా లక్ష్యంగా చేయబడ్డారని సమాచారం. మరోవైపు ఈ దాడిని తామే నిర్వహించామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రకారం.. దక్షిణ ఓడరేవు నగరమైన బందర్ అబ్బాస్‌లోని ఇరాన్ నావికా స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేపట్టినట్లు తెలిపారు.
ఇరాన్ సర్వోన్నత నాయకుడు, సుప్రీం మొజ్తాబా ఖమేనీ, తంగ్సిరి మరణంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయనను “ధైర్యవంతుడైన కమాండర్”గా అభివర్ణిస్తూ, దేశ రక్షణలో ఆయన చేసిన సేవలను ప్రశంసించారు. “సంవత్సరాల పోరాటం అనంతరం అమరత్వం పొందిన యోధుడుగా తంగ్సిరిని కొనియాడారు. ఐఆర్‌జీసీ విడుదల చేసిన ప్రకటనలో దేశ తీరప్రాంతాలు, కీలక ద్వీపాల రక్షణను బలోపేతం చేయడంలో తంగ్సిరి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.