క్రూడాయిల్ ధరలను భారీగా పెంచిన సౌదీ అరేబియా
Saudi Arabia | ఇంటర్నెట్ డెస్క్: హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా క్రూడాయిల్ ధరలను పెంచేసింది. ఆసియా కొనుగోలుదారులకు అధిక ధరకు విక్రయిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ వార్తా కథనం పేర్కొంది. సౌదీ ఆరామ్‌కో అరబ్ లైట్ క్రూడ్‌ను ప్రీమియం ధరకు విక్రయిస్తున్నట్లు పేర్కొంది. మే నెలకు గానూ బెంచ్‌మార్క్ ధర కంటే 19.50 డాలర్ల అధిక ధరకు ఆసియా రిఫైనరీలకు విక్రయిస్తున్నట్లు తెలిపింది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో చమురు ధరలు భగ్గుమన్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు 50 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. మరికొంతకాలం పాటు ఉద్రిక్తతలు కొనసాగే అవకాశం ఉండడంతో సౌదీ ఆరామ్‌కో ధరలను పెంచేసింది.
మరోవైపు మే నెలలో చమురు ఉత్పత్తి కోటాను రోజుకు 2,06,000 బ్యారెళ్ల మేర పెంచడానికి చమురు ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్+ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం కారణంగా ఏర్పడుతున్న పరిణామాల్లో, ఒపెక్ కీలక సభ్యదేశాలు చమురు ఉత్పత్తిని పెంచే పరిస్థితిలో లేవు. ఒపెక్+ సభ్యదేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఇరాక్ నుంచి చమురు ఎగుమతులు నిలిచిపోయాయి. క్షిపణి, డ్రోన్ దాడుల వల్ల గల్ఫ్ ప్రాంతంలో కూడా మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒకవేళ ఇప్పుడే యుద్ధం ఆగి, హర్మూజ్ జలసంధి వెంటనే తెరుచుకున్నా.. చమురు సరఫరా సాధారణ స్థితికి చేరుకోవడానికి, ఉత్పత్తి లక్ష్యాలను అందుకోవడానికి సమయం పడుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.