Sonia Gandhi | లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన రాజ్యాంగంపై దాడి : సోనియాగాంధీ
Sonia Gandhi : లోక్‌సభ (Lok Sabha) లో సీట్ల సంఖ్యను పెంచేందుకు చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ (Sonia Gandhi) ‘రాజ్యాంగంపై దాడి’ గా అభివర్ణించారు. అదేవిధంగా ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ కు సవరణను ప్రవేశపెట్టిన సమయంపై కేంద్రాన్ని ఆమె ప్రశ్నించారు. సోమవారం ఓ జాతీయ పత్రికలో ప్రచురితమైన వ్యాసంలో ఆమె కేంద్రంపై విమర్శలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై అఖిలపక్ష సమావేశం (All party meet) ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు కోరినా కేంద్రం తిరస్కరించిందని ఆరోపించారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఆధిపత్య ధోరణికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.
లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలలో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వ్ చేయాలనే ఆలోచనను తాము వ్యతిరేకించడం లేదని, 2027 జనాభా లెక్కలకు ముందే జరిగే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని సోనియాగాంధీ స్పష్టంచేశారు. పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 29న చివరి దశ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రభుత్వ కొత్త ప్రతిపాదనలపై చర్చించడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ.. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వానికి మూడుసార్లు లేఖలు రాశారని గుర్తుచేశారు. అత్యంత సహేతుకమైన ఈ అభ్యర్థనను తిరస్కరించారని తెలిపారు. అనధికారికంగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడం అత్యంత ప్రమాదకరమని సోనియాగాంధీ హెచ్చరించారు.
ఏప్రిల్ 16 నుంచి 18 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించడానికి బదులుగా.. వర్షాకాల సమావేశాల్లోనే ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ను సవరించే బిల్లు తీసుకురావాలని సోనియాగాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై మధ్యలో ప్రారంభమవుతాయని పేర్కొన్న సోనియా.. ఏప్రిల్ 29న పశ్చిమబెంగాల్‌లో పోలింగ్ పూర్తవుతుందని, పోలింగ్ ముగిసిన వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, రాజ్యాంగ సవరణ బిల్లులపై చర్చించి, వర్షాకాల సమావేశాల్లో వాటిని పరిగణలోకి తీసుకుంటే ఆకాశమేమీ కూలిపోదని వ్యాఖ్యానించారు.