సముద్రంలో ‘గుండు’సూది కోసం అమెరికా వేట..!
ఇంటర్నెట్ డెస్క్: ఒక భారీ జలాంతర్గామి మునిగినా.. విమానం కూలినా విశాల సముద్రంలో దాని కచ్చితమైన జాడను కనుక్కోవడానికి వారాలు పట్టొచ్చు.. ఏళ్లు పట్టొచ్చు. మలేసియా విమానం జాడ ఇప్పటికీ దొరక్కపోవడమే దీనికి ఉదాహరణ. అలాంటిది నీటి కింద అమర్చిన చిన్న సైజు సీమైన్స్ (SeaMines in Hormuz)ను వెతకడం అంటే.. సముద్రంలో ‘గుండుసూది’ కోసం జల్లెడ పట్టినట్లే. ప్రస్తుతం అమెరికా పరిస్థితి ఇదే. ‘ఇరాన్ సీమైన్స్’ను ఊడ్చేసి హర్మూజ్ జలసంధిని క్లీన్ చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నా.. అదంత సులువైన విషయం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు మైన్స్ ఎక్కడ పరిచామో తెలియదని ఇరాన్ గందరగోళం సృష్టించి వదిలేసింది. దీంతో ఇప్పుడు వాటిని గుర్తించి తొలగించడం అమెరికాకు కత్తిమీద సాములా మారింది.
మైన్స్ పనిపట్టే డెస్ట్రాయర్లు..
హర్మూజ్ (Strait of Hormuz) మార్గంలో ఇరాన్ (Iran) పరిచిన సీమైన్స్‌ను తొలగించేందుకు అమెరికా రెండు గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్లు యూఎస్‌ఎస్ ఫ్రాంక్ ఇ పీటర్సన్, యూఎస్‌ఎస్ మైఖేల్ ముర్ఫీని రంగంలోకి దింపింది. అయితే, ఇవి నేరుగా మైన్స్ ఉన్న ప్రాంతానికి వెళ్లవు. ఇందుకోసం ఎంకే 18, మాడ్ 2 కింగ్‌ఫిష్ లాంటి మానవరహిత అండర్‌వాటర్ వెహికల్స్‌ను అగ్రరాజ్యం ఉపయోగిస్తోంది. టోర్పిడో ఆకారంలో ఉండే ఈ డ్రోన్లు సముద్ర జలాల్లో వేగంగా కదులుతూ.. హైటెక్ సోనార్ల సాయంతో పేలుడు పదార్థాలను గుర్తిస్తాయి.
వీటితో పాటు ఎంహెచ్-60ఎస్ వంటి హెలికాప్టర్లను కూడా అమెరికా హర్మూజ్ వద్ద మోహరించింది.
ఇవి గగనతలం నుంచే సముద్రాన్ని స్కాన్ చేస్తాయి. వీటిలోని ఎయిర్‌బ్రోన్ లేజర్ మైన్ డిటెక్షన్ సిస్టమ్.. సముద్ర ఉపరితలంపై తేలే, కొంచెం లోతులో ఉండే మైన్లను వేగంగా గుర్తిస్తుంది. సీమైన్స్ కనబడిన వెంటనే హెలికాప్టర్ లేదా డ్రోన్ సాయంతో వాటిని నౌకాదళం నిర్వీర్యం చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎయిర్‌బ్రోన్ మైన్ న్యూట్రలైజేషన్ సిస్టమ్‌ను అమెరికా ఉపయోగిస్తోంది. ఈ సిస్టమ్‌తో హెలికాఫ్టర్/డ్రోన్ల నుంచి చిన్నపాటి రోబోటిక్ పరికరాన్ని పంపిస్తారు. అది నేరుగా మైన్ మీదకు వెళ్లి పేల్చేస్తుంది. ఇక, అమెరికా డెస్ట్రాయర్లు కేవలం మైన్లను తొలగించడం మాత్రమే గాక.. సముద్ర ఉపరితలంపై ఎదురయ్యే ముప్పులను పసిగట్టి..
క్షిపణులతో ఛేదించగలవు.
మైన్‌స్వీపింగ్ ఈజీ కాదు..
మైన్లను తొలగించే ప్రక్రియ అంత సులువైందని కాదని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా సీమైన్స్‌లో చాలా రకాలుంటాయి. సముద్ర జలాల్లో నౌకలు కదిలినప్పుడు ఏర్పడే పీడనం, తరంగాల శబ్దం, నౌకల విద్యుత్ శక్తి ఆధారంగా పనిచేసే మైన్స్ ఉంటాయి. వీటిల్లో కొన్నింటిని లేజర్ లేదా రాడార్ల సాయంతోనూ గుర్తించలేమని, ఒకవేళ గుర్తించినా వాటిని పేల్చడం కష్టతరమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకు అమెరికా వద్ద ప్రస్తుతమున్న మైన్‌స్వీపింగ్ సామర్థ్యం సరిపోదని అంచనా వేస్తున్నారు.
అగ్రరాజ్యం గతేడాది పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న నాలుగు ప్రత్యేక మైన్‌స్వీపర్లను నేవీ విధుల నుంచి పక్కనబెట్టింది. ప్రస్తుతం ఈ బాధ్యతలను లిట్టోరల్ కాంబాట్ షిప్‌లు నిర్వర్తిస్తున్నాయి. అమెరికా వద్ద ఈ రకం నౌకలు మూడు ఉండగా.. అవి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయన్నది రహస్యమే. గత నెల ఇందులో రెండు సింగపూర్ జలాల్లో కన్పించినట్లు వార్తలు వచ్చాయి. అందువల్ల క్లిష్టతరమైన మైన్లను తొలగించేందుకు అమెరికా ఇప్పుడు మిత్ర దేశాలపై ఆధారపడొచ్చనే అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి.