Select Location
All Locations
State
Region
City / District
సౌత్ కు అన్యాయం జరిగితే భారీ ఉద్యమం..

సౌత్ కు అన్యాయం జరిగితే భారీ ఉద్యమం.. డీలిమిటేషన్‌‌‌‌పై కేంద్రానికి స్టాలిన్ హెచ్చరిక

చెన్నై: నియోజకవర్గాల పునర్​విభజన(డీలిమిటేషన్)​లో తమిళనాడు, సౌత్​కు ఏమాత్రం అన్యాయం జరిగినా ఊరుకునేది లేదని.. తమ తడాఖా ఏంటో చూపిస్తామని కేంద్రానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్​వార్నింగ్​ఇచ్చారు. ఏప్రిల్ 16న మొదలయ్యే పార్లమెంట్ స్పెషల్ సెషన్‌‌‌‌లో లోక్‌‌‌‌సభ నియోజకవర్గాల సంఖ్యను 816కు పెంచే బిల్లును తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ పార్లమెంటు స్పెషల్ సెషన్ ఎందుకు అని స్టాలిన్ ప్రశ్నించారు. మంగళవారం చైన్నైలో విడుదల చేసిన వీడియోలో ఆయన కేంద్రాన్ని నిలదీశారు. మహిళా రిజర్వేషన్ చట్టం, 2023 ప్రకారం లోక్‌‌‌‌సభ, అసెంబ్లీల్లో 33 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తారని.. 

అయితే ఇది వెంటనే అమలులోకి రాదని, జనగణన, డీలిమిటేషన్ పూర్తయిన తర్వాతే అమలులోకి వస్తుందన్నారు. స్టాలిన్ మాట్లాడుతూ.. డీఎంకే ఎంపీలు స్పెషల్ సెషన్‌‌‌‌లో పాల్గొంటారని, కానీ తమిళనాడుకు నష్టం కలిగించే నిర్ణయం తీసుకుంటే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ‘తమిళనాడు స్తంభించిపోతుంది. ప్రతి కుటుంబం రొడ్డెక్కుతుంది’ అని స్పష్టం చేశారు. జనాభా నియంత్రణ పాటించాలని కేంద్రం చెప్పినప్పుడు తమిళనాడు అనుసరించిందని, అందుకు ఇప్పుడు శిక్ష వేస్తున్నారా అని నిలదీశారు. దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవంటూ పార్లమెంట్‌‌‌‌లో ప్రధాని హామీ ఇవ్వాలని చాలాసార్లు అడిగినా సమాధానం రాలేదని పేర్కొన్నారు. సోనియా గాంధీ కూడా ఇదే అభ్యంతరం లేవనెత్తినా కేంద్రం నిర్లక్ష్యంగా ఉందని స్టాలిన్ అన్నారు. 

1950లు, 60ల నాటి డీఎంకే స్ఫూర్తితో తాను స్వయంగా నేతృత్వం వహించి ఆందోళన నిర్వహిస్తానని స్టాలిన్ ప్రకటించారు. స్టాలిన్ వార్నింగ్​పై తమిళనాడు బీజేపీ ప్రతినిధి ఏఎన్ఎస్ ప్రసాద్ స్పందిస్తూ, ప్రధానికి ‘వార్నింగ్’ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, ఉత్తర, దక్షిణ విభజన సృష్టించే మాటలు సరికాదని అన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ మాట్లాడుతూ, కేంద్రం తీసుకొస్తున్న డీలిమిటేషన్ ప్రతిపాదన ఉత్తర, -దక్షిణ భారత్ మధ్య చీలికకు దారితీస్తున్నదని ఆరోపించారు. కేరళ, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు జనాభా నియంత్రణలో మంచి ప్రగతి చూపించినందుకు శిక్షపడకూడదని డిమాండ్ చేశారు. జనసంఖ్య ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు వచ్చి.. దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సీట్లు వస్తాయని ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.


V6 News 1 hour ago
Home Flash News