2027 వరకు పెట్రోల్ ధరలు ఎక్కువగానే: అమెరికా ఇంధనశాఖ మంత్రి
ఇంటర్నెట్‌డెస్క్: ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)లో మరోసారి ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. రెండోసారి శాంతి చర్చలపైనా స్పష్టత కనిపించడం లేదు. దాంతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్‌రైట్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 వరకు అమెరికాలో పెట్రోల్ ధరలు ఎక్కువగానే ఉండొచ్చని అంచనా వేశారు. పెట్రోల్ ధర ఒక గ్యాలన్‌కు 3 డాలర్ల పైనే ఉండొచ్చన్నారు (Petrol Prices).
‘‘ఒకవేళ ఈ ఏడాది చివర్లో పెట్రోల్ ధర 3 డాలర్ల కంటే తక్కువకు రావొచ్చు. లేకపోతే వచ్చే ఏడాది వరకు తగ్గకపోవచ్చు. వివాదం పరిష్కారమైతేనే ధరలు దిగొస్తాయి’’ అని క్రిస్‌రైట్ పేర్కొన్నారు. ఈ ధరలపై ట్రంప్ యంత్రాంగంలోని నేతలు ఒక్కొక్కరూ ఒక్కో ప్రకటన చేస్తున్నారు. ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. ఈ ఏడాది వేసవిలో 3 డాలర్లకు తగ్గొచ్చని అంచనా వేశారు. ఆదివారం అమెరికా (USA)లో ఒక గ్యాలన్ పెట్రోల్ ధర సగటున 4.05 డాలర్లుగా ఉంది. గతేడాది ఇదే సమయానికి ఆ రేటు 3.16 డాలర్లే. సాధారణంగా అమెరికా ముడి చమురు ఎగుమతి చేసే దేశం. అక్కడే పెట్రోల్ ధరలు అధికంగా ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా దిగుమతిపై ఆధారపడిన దేశాల పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశం ఉంది.
హర్మూజ్ దిగ్బంధనంతో చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెల్‌కు ఆరు శాతం పెరిగి.. 95.89 డాలర్లకు చేరింది. ఫ్యూచర్స్‌లో యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ 7 శాతానికి పైగా పెరిగి, 90.13 డాలర్లుగా ఉంది. కాగా.. ఇరాన్ (Iran) పతాకంతో ప్రయాణిస్తున్న తౌస్కా అనే వాణిజ్య నౌకపై అమెరికా దళాలు కాల్పులు జరిపి, స్వాధీనం చేసుకొన్నాయి. గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో చోటుచేసుకొన్న ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ధ్రువీకరించారు. దీనిపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఐఆర్జీసీ దళం అమెరికా యుద్ధ నౌకల పైకి డ్రోన్లను ప్రయోగించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ప్రెస్ టీవీ వెల్లడించింది. ఈ పరిణామాలు ఉద్రిక్తతలను ఒక్కసారిగా పెంచాయి.