కీలక పోరున్న చోట్లనే..
రాష్ట్రంలోనే అత్యధికంగా కరూర్ అసెంబ్లీ స్థానంలో 79 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 8 మంది అభ్యర్థుల పేర్లతో స్వతంత్రులు పోటీ చేస్తున్నారు. అన్నాడీఎంకే నుంచి మాజీ మంత్రి ఎం.ఆర్.విజయ భాస్కర్ బరిలో ఉండగా.. ఆర్.వి.విజయ భాస్కర్ పేరుతో స్వతంత్ర అభ్యర్థి పోటీ చేస్తున్నారు. చెన్నైలోని రాయపురంలో అన్నాడీఎంకే అభ్యర్థిగా మాజీ మంత్రి డి.జయ కుమార్ పోటీ చేస్తుంటే అదే పేరుతో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్నారు. తిరుచ్చి ఈస్ట్‌లో టీవీకే అధినేత విజయ్ బరిలో ఉండగా.. అదే పేరుతో ఓ స్వతంత్రుడున్నారు. చెన్నై ఆలందూర్‌లో మంత్రి అన్బళగన్‌పై పోటీ చేస్తున్న అన్నాడీఎంకే అభ్యర్థి పేరు ఎస్.శరవణన్.
ఇదే పేరుతో నలుగురు స్వతంత్రులు పోటీపడుతున్నారు. అన్బళగన్ పేరుతోనూ మరో స్వతంత్రుడున్నారు. థౌజండ్ లైట్స్ నుంచి టీవీకే తరఫున కీలక నేత జేసీడీ ప్రభాకర్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ అదే పేరుతో నలుగురు స్వతంత్రులున్నారు. ఇదే నియోజకవర్గం అన్నాడీఎంకే మహిళా అభ్యర్థి, మాజీ మంత్రి వళర్మతి పేరుతో మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులున్నారు. కోయంబత్తూర్ సౌత్‌లో మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ పోటీ చేస్తుండగా, సెంథిల్ కుమార్ పేరుతో ముగ్గురు స్వతంత్రులున్నారు. ఇదే తరహాలో మరికొన్ని నియోజకవర్గాలోనూ ప్రధాన అభ్యర్థుల పేరుతో ఇద్దరు, ముగ్గురేసి స్వతంత్రులు బరిలో ఉన్నారు.