ఇరాన్‌కు సీక్రెట్ సాయం.. చైనా దొరికిపోయిందా?
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రికత్తల వేళ పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యుద్ధంలో ఇరాన్‌కు చైనా సాయం చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి. ఇలాంటి తరుణంలో అమెరికా రిపబ్లికన్ పార్టీకి చెందిన భారతీయ మూలాల నాయకురాలు నిక్కీ హేలీ దీనికి సంబంధించిన విషయాన్ని బహిర్గతం చేశారు. దీంతో, చైనా అడ్డంగా బుక్కైనట్టు నీక్కి చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో చైనాను అమెరికా టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే చాన్స్ ఉంది.
పశ్చిమాసియా ఘర్షణల్లో చైనా ఇరాన్‌కు రహస్యంగా సాయం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. చైనా టెహ్రాన్‌కు భారీగా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. మనిషి భుజం మీద పెట్టుకొని క్షిపణులను ప్రయోగించే షార్ట్ రేంజ్ మిసైల్ లాంచర్‌లను, ఇతర క్షిపణి వ్యవస్థలను టెహ్రాన్‌కు సరఫరా చేయడానికి బీజింగ్ ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిపాయి. తన పేరు బయటకు రాకుండా ఉండేందుకు చైనా ఈ ఆయుధాలను ఇతర దేశాల మీదుగా పంపుతున్నట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు పట్టుబడిన ఇరాన్ నౌక టౌస్కా అనే కంటైనర్ చర్చనీయాంశంగా మారింది. ఈ ఆరోపణకు ఆజ్యం పోసింది.
కాగా, ఇటీవలే అమెరికా నౌకాదళం హార్మూజ్ సముద్ర మార్గంలో ఇరాన్ జెండాతో ప్రయాణిస్తున్న Touska అనే కంటైనర్ నౌకను స్వాధీనం చేసుకుంది. ఈ నౌక ఇరాన్ షిప్పింగ్ లైన్స్ (IRISL)కు చెందినది. IRISLపై అమెరికా 2019లోనే ఆంక్షలు విధించింది. ఎందుకంటే ఇది ఇరాన్ క్షిపణి కార్యక్రమానికి అవసరమైన వస్తువులను తరలిస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో నిక్కీ హేలీ.. ఈ నౌక చైనా నుండి ఇరాన్‌కు వస్తూ, క్షిపణుల తయారీకి ఉపయోగించే రసాయన పదార్థాలను తీసుకెళ్తోందని ఆరోపించారు. నౌకలను ఆపాలని అమెరికా పదేపదే ఆదేశాలు ఇచ్చినా ఇరాన్ మాత్రం దీన్ని ఆపలేదు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో, యుద్ధంలో ఇరాన్‌కు చైనా సహాయం చేస్తోంది అనే వెల్లడి అయ్యింది. ఇది విస్మరించలేని వాస్తవం’ అని ఆమె పేర్కొన్నారు.