దశాబ్దాలుగా యాపిల్‌లోనే.. టిమ్‌కుక్ ఆస్తి ఎంతో తెలుసా..?
Tim Cook| ఇంటర్నెట్‌డెస్క్: సీఈఓగా టెక్ దిగ్గజం యాపిల్ (Apple)ను 15 ఏళ్లుగా నడిపిస్తున్నారు. 2011లో బాధ్యతలు చేపట్టాక కంపెనీ షేరు విలువ 20 రెట్లు పెరిగింది. కంపెనీ విలువ నాలుగు ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఈ లెక్కన ఆ సీఈఓ టిమ్‌కుక్ ఆస్తిపాస్తులు కూడా గట్టిగానే ఉంటాయనిపిస్తుంది కదా..! ప్రపంచవ్యాప్తంగా యాపిల్‌ను అత్యంత విలువైన సంస్థగా మార్చే క్రమంలో టిమ్‌కుక్ ఆస్తులు కూడా పెరిగాయి. ఫోర్బ్స్ తాజా గణాంకాల ప్రకారం.. ఆయన ఆస్తుల నికర విలువ 2.9 బిలియన్ డాలర్లు (రూ.27వేలకోట్లు పైమాటే).
ఆ మొత్తంలో ఎక్కువభాగం యాపిల్ స్టాక్స్ రూపంలోనే ఉంది. కుక్ వద్ద 30 లక్షల షేర్లు ఉన్నాయి. అయినా సరే కంపెనీ వాటాలో ఒక శాతానికంటే తక్కువ కావడం గమనార్హం. ఐబీఎంలో 12 ఏళ్లు పనిచేసిన అనంతరం 1998లో యాపిల్‌లో చేరిన టిమ్‌కుక్.. ప్రారంభంలో ఆపరేషన్స్ అండ్ సప్లయి చైన్ విభాగాల్లో పనిచేశారు. తర్వాత స్టీవ్‌జాబ్స్ ఆధ్వర్యంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ స్థాయికి ఎదిగారు. అనారోగ్య కారణాలతో స్టీవ్‌జాబ్స్ వైదొలగడంతో 2011లో సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అంకెల్లో టిమ్‌కుక్ ఘనత.. 2025, సెప్టెంబర్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో యాపిల్ 112 బిలియన్ డాలర్ల నికర ఆదాయాన్ని ఆర్జించింది.
2010 ఆదాయంతో పోలిస్తే 8 రెట్లు ఎక్కువ. ఈ సమయంలో అమెరికా- చైనా మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. లాభంలో 699 శాతం వృద్ధి కనిపించింది. యాపిల్ 23 దేశాల్లో 540కి పైగా స్టోర్లను నడుపుతోంది. టిమ్ వచ్చాకే 200 స్టోర్లను ఏర్పాటుచేశారు. అధిక సంఖ్యలో ఉత్పత్తులను తయారు చేయడం కాదు.. మార్పు తెచ్చేవాటిని రూపొందించడమే మన లక్ష్యం అని కుక్ చెప్తుంటారు. యాపిల్ జనవరి గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ యాక్టివ్ డివైజ్‌లు ఉన్నాయి.