కాఫీ-టీ కలుస్తాయా?.. తమిళనాడులో ఏం జరగనుంది?
అన్నాడీఎంకే(ఎన్డీయే కూటమి)- టీవీకే పొత్తు చర్చల వేళ.. బీజేపీ సీనియర్ నాయకుడు అన్నామలై గతంలో చేసిన వ్యాఖ్యలు.. మళ్ళీ చర్చనీయాంశంగా మారాయి. అన్నామలై.. విజయ్ పార్టీతో (TVK) పొత్తు అసాధ్యమని గతంలో స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. కాఫీ, టీ కలిసిపోవు.. మేము సిద్ధాంతపరంగా విరుద్ధమంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఎన్నికల ఫలితాలు హంగ్ అసెంబ్లీగా వస్తే, అన్నాడీఎంకే.. విజయ్ పార్టీతో పొత్తు గురించి ఆలోచించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
గతంలో ఓ వార్తా సంస్థతో జరిగిన ఇంటర్వ్యూలో ఒకవేళ అవసరమైతే విజయ్‌తో కలిసి పనిచేయడానికి బీజేపీ సిద్ధంగా ఉంటుందా?" అని అడగ్గా.. అన్నామలై ఘాటుగా స్పందించారు. "కాఫీ, టీ ఒకదానితో ఒకటి కలవవని నేను చాలాసార్లు చెప్పానంటూ ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే, ఎడప్పాడి కె. పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే, విజయ్‌తో పొత్తు కోసం ప్రయత్నించవచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ (తమిళగ వెట్రి కళగం) ఘనవిజయం సాధిస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. కొన్ని సర్వేల ప్రకారం, టీవీకే 98 నుండి 120 స్థానాలను గెలుచుకుని..
అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఒక సర్వే టీవీకేకు సుమారు 35 శాతం ఓట్లు రావచ్చని అంచనా వేసింది. ఇది అధికార డీఎంకేతో సమానంగా ఉందని.. అదే సమయంలో ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమికి 23 శాతం ఓట్లు రావచ్చని అంచనా వేశారు. జేవీసీ (JVC) ఎగ్జిట్ పోల్ ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమికి స్పష్టమైన మెజారిటీని అంచనా వేయగా.. మెజారిటీ సర్వేలు మాత్రం పోరు హోరాహోరీగా ఉంటుందని సూచిస్తున్నాయి. వివిధ పోల్స్ సారాంశం ప్రకారం, డీఎంకే కూటమి 112 నుండి 129 స్థానాలను, ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ 86 నుండి 103 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది.
తుది ఫలితాలు దగ్గరగా ఉంటే, టీవీకే 'కింగ్ మేకర్'గా మారే అవకాశముందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఒకవేళ బీజేపీ విముఖత చూపినా, అన్నామలై వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఏఐఏడీఎంకేపై ఈ పరిస్థితి తీవ్ర ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే విడతలో జరిగాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. పాత ప్రత్యర్థులు, కొత్త శక్తులు తమ రాజకీయ వ్యూహాలను మార్చుకుంటారా? అన్నది ఆసక్తి కలిగిస్తోంది.