Select Location
All Locations
State
Region
City / District
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..మెట్రో ఫేజ్-2కు అనుమతులే టార్గెట్!

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..మెట్రో ఫేజ్-2కు అనుమతులే టార్గెట్!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉదయం దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు బయలుదేరుతున్నారు. ఈ పర్యటన అటు పాలనాపరంగా, ఇటు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ (ఫేజ్-2) ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు, నిధుల సమీకరణపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఈ క్రమంలోనే పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, విభజన హామీల అమలు, సంక్షేమ పథకాలకు అందాల్సిన తోడ్పాటుపై ముఖ్యమంత్రి విజ్ఞప్తులు చేయనున్నారు. వీటితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరిన నేపథ్యంలో, సంబంధిత అధికారులతో భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

మరోవైపు కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) 102 సీట్లతో సాధించిన అఖండ విజయం రేవంత్ రెడ్డి పర్యటనకు మరింత ఊపునిచ్చింది. కేరళ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్‌గా రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించి, కూటమి విజయంలో తనవంతు కృషి చేశారు. ప్రస్తుతం అక్కడ ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ కొనసాగుతుండగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరు రేసులో బలంగా వినిపిస్తోంది. రేవంత్ రెడ్డికి వేణుగోపాల్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో, ఈ పర్యటనలో కేరళ రాజకీయ పరిణామాలతో పాటు తెలంగాణలో కేబినెట్ విస్తరణ, పార్టీ బలోపేతం వంటి అంశాలపై ఏఐసీసీ అగ్రనేతలతో ముఖ్యమంత్రి కీలక చర్చలు జరపనున్నారు. పర్యటన ముగించుకుని రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.


Smacy News 43 minutes ago
Home Flash News