Revanth Reddy | ఢిల్లీలో ఖాళీగా రేవంత్.. ! అధిష్ఠానం పిలుపు కోసం రోజంతా ఎదురుచూపు
హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం రోజంతా తుగ్లక్ రోడ్డులోని తన నివాసంలోనే ఎక్కువ సమయం గడిపారు. రోజంతా ఎదురుచూసినా అధిష్ఠానం నుంచి పిలుపు రాకపోవడంతో, చివరికి సాయంత్రం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసి మమ అనిపించారు. వాస్తవానికి కాంగ్రెస్ పెద్దలు కేరళంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కసరత్తు చేస్తున్నారు. తాను కేరళం మంత్రివర్గ కూర్పులో పాల్గొంటానంటూ పార్టీ పెద్దలకు రేవంత్ సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. కానీ వారి నుంచి స్పందన రాలేదని విశ్వసనీయవర్గాల సమాచారం. అయినప్పటికీ ఆయన బుధవారం ఢిల్లీ వెళ్లారు. మంత్రివర్గ కూర్పుపై చర్చల్లో తాను కూడా పాల్గొంటే కేరళం గెలుపు క్రెడిట్‌ను తీసుకోవచ్చని ప్రయత్నం చేసినట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.
అయితే ఏఐసీసీ పెద్దలు ఎవరూ రేవంత్ రెడ్డిని పిలువలేదని ఢిల్లీ వర్గాలు తెలిపాయి. చివరకు ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌రెడ్డి మాట్లాడి, ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన మద్దతు ఆయనకే ఉంటుందని చెప్పినట్టు సమాచారం. ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీకి కూడా చెప్పేందుకు సిద్ధమయ్యారని, కానీ వారెవరూ రేవంత్‌రెడ్డికి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని చెప్తున్నారు. అధిష్ఠానం పిలువకపోవడంతో తన ఢిల్లీ పర్యటనపై విమర్శలు వస్తాయని భావించిన రేవంత్‌రెడ్డి, సాయంత్రం కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ కట్టర్‌తో సమావేశం అయ్యారు. ఎప్పటి మాదిరిగానే హైదరాబాద్ మెట్రో అంశాన్ని ఎజెండాగా ముందుపెట్టారు. రెండోదశకు ఆమోదం తెలుపాలని, నిధుల విషయంలో సహకరించాలని విజ్ఙప్తి చేశారు.తెలంగాణ వార్తలు