Select Location
All Locations
State
Region
City / District
గేటెడ్ కమ్యూనిటీల ఆందోళనలకు చెక్.. క్యూఆర్ కోడ్ ఐడీలతో సెన్సస్ అధికారులు

గేటెడ్ కమ్యూనిటీల ఆందోళనలకు చెక్.. క్యూఆర్ కోడ్ ఐడీలతో సెన్సస్ అధికారులు

సెన్సస్ సేకరణ ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు మరియు ప్రజల్లో ఉన్న ఆందోళనలను తొలగించేందుకు హర్యానా డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై జనగణన కోసం మీ ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్ల వివరాలను వారి ఐడెంటిటీ కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్ ద్వారా క్షణాల్లో అథెంటికేట్ చేయెుచ్చు.

ముఖ్యంగా నగరాల్లోని హై-ఎండ్ గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లలో నివసించే వారు భద్రతా కారణాల దృష్ట్యా ఎన్యుమరేటర్లను( జనగణన సిబ్బందిని) లోపలికి అనుమతించడానికి నిరాకరిస్తున్న నేపథ్యంలో కొత్త చర్యలు చేపట్టినట్లు హర్యానా సెన్సస్ డైరెక్టర్ లలిత్ జైన్ వెల్లడించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇళ్లలోకి వస్తే ప్రమాదం ఉండవచ్చనే ప్రజల భయాన్ని పోగొట్టడమే ఈ క్యూఆర్ కోడ్ ఐడీ కార్డుల ప్రధాన ఉద్దేశంగా వెల్లడించారు.

ప్రతి ఎన్యుమరేటర్‌కు ప్రభుత్వం అధికారికంగా జారీ చేసిన గుర్తింపు కార్డుపై ఈ స్కాన్ కోడ్ ఉంటుంది. ఏదైనా అనుమానం కలిగితే.. ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌తో ఆ కోడ్‌ను స్కాన్ చేసి, సదరు వ్యక్తి నిజంగా ప్రభుత్వ అధికారా? కాదా? అనే విషయాన్ని వెంటనే తెలుసుకోవచ్చు. దీనివల్ల మోసాలకు తావుండదని అధికారులు చెబుతున్నారు.

జనగణన అనేది దేశాభివృద్ధికి, ప్రభుత్వ స్కీమ్స్ రూపకల్పనకు అత్యంత కీలకం. కాబట్టి ప్రజలందరూ తమ వద్దకు వచ్చే గణనకర్తలకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ఈ క్యూఆర్ కోడ్ టెక్నాలజీ వినియోగం ద్వారా డేటా సేకరణలో భద్రత పెరగడమే కాకుండా, ప్రజలకు.. అధికారులకు మధ్య నమ్మకం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. డిజిటల్ పద్ధతిలో ఐడెంటిటీని నిర్ధారించుకునే ఈ విధానం దేశవ్యాప్తంగా సాఫీగా జరగడానికి దోహదపడనుంది.


V6 News 1 hour ago
Home Flash News