OTT Movie Review: క్షుద్రపూజలపై ఉత్కంఠరేపే కథనం.. ఓటీటీలో మస్ట్ వాచ్ హారర్ మూవీ!
తమిళ హారర్ సైకాలజికల్ థ్రిల్లర్ “సతన్ ది డార్క్” (Satan: The Dark). “సతన్” అంటే “సైతాన్” అనే అర్థం. శుక్రవారం (మే8న) వీకెండ్ స్పెషల్గా వచ్చిన ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. క్షుద్రపూజ విఫలమవడంతో ఓ దుష్టశక్తి బయటకు రావడం, ఆ తర్వాత జరిగే భయానక పరిణామాలు ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేస్తాయి. హారర్‌తో పాటు సైకాలజికల్ ఎలిమెంట్స్‌ను సమర్థంగా మిళితం చేసిన ఈ మూవీ మొదటి నుంచి చివరి వరకు ఉత్కంఠను కొనసాగిస్తుంది. దర్శకుడు మణికందన్ రామలింగం తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 27న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి స్పందన లభించింది.
ఇప్పుడు ఓటీటీలోకి రావడంతో మరింత మంది ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తోంది. ఇందులో ఎఫ్‌జే, అయ్రా, చందిని తమిళరసన్, మోనా బెడ్రే, శ్రీజా రవి ప్రధాన పాత్రల్లో నటించారు. కథేంటంటే? ఈ సినిమా కథ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం నాటి నేపథ్యంలో సాగుతుంది. రెండు వేర్వేరు కాలరేఖల్లో నడుస్తుంది. అస్తినాపురం గ్రామంలో జరిగిన ఓ విఫలమైన చేతబడి పూజ కారణంగా భయంకరమైన శాపం పుడుతుంది. తరతరాలుగా ఆ గ్రామాన్ని వెంటాడుతున్న ఆ దుష్టశక్తి నుంచి తన ప్రేమించిన యువతిని రక్షించేందుకు ఓ యువకుడు చేసే పోరాటమే కథాంశం. మరో వైపు ఈ దుష్టశక్తి వల్ల ప్రస్తుత కాలంలో మార్సెలిన్ (మోనా బెడ్రే) అనే మహిళ ప్రవర్తన హఠాత్తుగా మారుతుంది. ఏదో అదృశ్య శక్తి ప్రభావంతో మార్సెలిన్ హింసాత్మకంగా ప్రవర్తిస్తుండటంతో, ఆమె కుమార్తె అలిషా (అయిరా పాలక్) ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది.
ఆ శాపం నుంచి తన బిడ్డను కాపాడుకోవడానికి మార్సెలిన్ చేసిన పోరాటం సినిమాని తారాస్థాయికి తీసుకెళ్తుంది. కథలో కాకి నేపథ్యంలో వచ్చే సీన్స్ సినిమాను మలుపు తిప్పుతాయి. గతంతో ముడిపడిన అతీంద్రియ శక్తులు, వాటి వెనుకున్న రహస్యాలు కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. “సతన్ ది డార్క్” సాధారణ హారర్ సినిమాల మాదిరిగా కేవలం భయపెట్టడానికే పరిమితం కాకుండా, సైకాలజికల్ థ్రిల్లర్ అంశాలను కూడా కలిపి ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకోవడం సినిమాకు కొత్త ఫీల్ తీసుకొచ్చింది. గ్రామాన్ని వెంటాడే శాపం, చేతబడి పూజలు, అతీంద్రియ శక్తులు వంటి అంశాలు కథకు మంచి హారర్ ఎలిమెంట్‌ను జోడించాయి.