మోడీ ప్రకటనతో బంగారం వ్యాపారులు బెంబేలు : మా పొట్ట కొట్టొద్దు అంటూ ప్రధానితో మీటింగ్..!
బంగారం కొనొద్దు.. ఏడాదిపాటు బంగారం జోలికి వెళ్లొద్దు.. ఎవరూ బంగారం కొనొద్దు అంటూ ప్రధాని మోడీ చేసిన ప్రకటనతో దేశ వ్యాప్తంగా బంగారం వ్యాపారులు బెంబేలు ఎత్తుతున్నారు. ధరల పెరుగుదలతో ఇప్పటికే బంగారం అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని.. ఇలాంటి టైంలో ఏడాదిపాటు బంగారం కొనొద్దు అంటే మా వ్యాపారాలు ఏం కావాలి అంటూ దేశ వ్యాప్తంగా బంగారం వ్యాపారులు లబోదిబో అంటున్నారు. ఏడాదిపాటు బంగారం కొనకపోతే.. ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలు కనిపిస్తాయని.. బంగారం కంటే బెటర్ ఆప్షన్ కనిపిస్తే.. దేశ వ్యాప్తంగా బంగారం వ్యాపారం ఢమాల్ అంటుందనే భయం వ్యాపారుల్లో నెలకొంది. ఈ క్రమంలోనే బంగారం వ్యాపారుల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకున్నది.
ప్రధాని మోదీతో భేటీ కావాలని నిర్ణయించుకున్నది. హైదరాబాద్ ప్రసంగంలో ప్రజలను ఏడాది పాటు గోల్డ్ కొనటం ఆపాలంటూ ప్రధాని మోడీ చేసిన రిక్వెస్ట్.. దేశీయ స్టాక్ మార్కెట్‌లోని జ్యువెలరీ సెక్టార్‌లో భూకంపాన్ని సృష్టించింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా పెళ్లిళ్లకు కూడా ఏడాది పాటు బంగారం కొనొద్దని, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని మోడీ కోరడం ఇన్వెస్టర్లను వణికించింది. దీని ప్రభావం సోమవారం మార్కెట్ ప్రారంభం కాగానే స్పష్టంగా కనిపించింది. బంగారం రంగానికి చెందిన కంపెనీల షేర్లు ఏకంగా 11 శాతం వరకు కుప్పకూలి, ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేశాయి. టైటాన్, సెన్కో గోల్డ్, కళ్యాణ్ జ్యువెలర్స్ వంటి దిగ్గజ సంస్థల షేర్లు అమ్మకాల ఒత్తిడితో చిత్తవుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న జ్యువెలరీ అసోసియేషన్లు అప్రమత్తమయ్యాయి. ప్రధాని పిలుపు తమ వ్యాపారాలను దెబ్బతీస్తుందనే ఆందోళనతో మే 12న ఈ సంఘాల ప్రతినిధులు ప్రధానమంత్రి కార్యాలయ అధికారులతో భేటీ కానున్నారు. తమ గోడును వెళ్లబోసుకోవడంతో పాటు, మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీయకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారు చర్చించనున్నారు. కేవలం ఒక ప్రకటనతో ఇంతటి ప్రకంపనలు రావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.