'ధాన్యం సేకరణలో జాప్యం వద్దు'.. కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
హైదరాబాద్: మిషన్ మోడ్‌లో పనిచేస్తూ రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కలెక్టర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తేనే సమస్యలు తలెత్తవని, ఏ సమస్య వచ్చినా కలెక్టర్లు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ, పురోగతిపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వివిధ జిల్లాల్లో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో తలెత్తిన ఇబ్బందులు, సమస్యలపై కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో ముఖ్యమంత్రి కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కొనుగోళ్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాలని కలెక్టర్లను ఆదేశించారు. “కొనుగోలు కేంద్రాల్లో అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించాలి. గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్లకు తరలించాలి. ధాన్యం లోడ్ తరలించేందుకు ఒప్పందం మేరకు సరిపడా లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లను ఉపేక్షించరాదు. అవసరమైతే అలాంటి వారిపై క్రిమినల్ కేసులకూ వెనకాడొద్దు. ధాన్యం లోడింగ్ విషయంలో జాప్యం జరగకుండా స్థానికంగా ఉన్న హమాలీలను గుర్తించి వారితో పని చేయించుకోవాలి. ధాన్యం లోడ్ చేసిన వెంటనే రైతులకు రశీదు అందేలా చర్యలు తీసుకోవాలి. అలా చేయడం వల్ల తాలు, తరుగు పేరుతో అక్రమాలు జరగకుండా చూడొచ్చు” అని చెప్పారు.
లారీల కొరత ఉంటే దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ట్రాక్టర్లు, ఇతర వాహనాలను వినియోగించాలని, ధాన్యం తరలించడానికి అవసరమైన వాహనాలను అందుబాటులో ఉండేలా చూడాలని ఈ సందర్భంగా రవాణా శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. “పలు ప్రాంతాల్లో గోదాముల సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటి ప్రాంతాల్లో అవసరాన్నిబట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలి. గోడౌన్స్ సమస్య ఉన్న ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలి. అవసరమైన చోట రైతుబజార్లు, ఫంక్షన్ హాళ్లను అందుబాటులోకి తీసుకుని ధాన్యాన్ని తరలించాలి. వెసులుబాటు ఆధారంగా అక్కడినుంచి గోడౌన్లకు తరలించేలా ప్రణాళికలుండాలి” అని సూచించారు.