Select Location
All Locations
State
Region
City / District
POCSO Act | పోక్సో చట్టం ఏం చెప్తున్నది?

POCSO Act | పోక్సో చట్టం ఏం చెప్తున్నది?

POCSO Act | తెలంగాణ రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఇప్పుడొక కేసు గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు, నిందితుడి పరారీ, కేసు పూర్వాపరాలపై విస్తృతమైన చర్చ నడుస్తున్నది. ఈ చర్చలో కొందరు తమకు తోచిన విధంగా చట్టానికి భాష్యాలు చెప్తున్నారు. మరికొందరు అసత్యాలు, అర్ధసత్యాలను ప్రచారం చేస్తున్నారు. పోక్సో చట్టంపై అవగాహన లేకనో, ఉద్దేశపూర్వకంగానో చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఇవి కూడా నేరాలే. ఈ నేపథ్యంలో అసలు బాలల పరిరక్షణలో పోక్సో చట్టం ప్రాధాన్యత ఏంటి, చట్టం ఏం చెప్తున్నది? తెలుసుకుందాం.

ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రెన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌ (పోక్సో) చట్టం ఉద్దేశం లైంగిక దాడుల నుంచి బాల బాలికలకు రక్షణ కల్పించడం. దేశంలో మహిళలపై, ముఖ్యంగా చిన్నారులపై జరుగుతున్న లైంగిక నేరాలు సమాజాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. మరికొందరు మైనర్‌లను మోసం చేయడం, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి శారీరక సంబంధాలు పెట్టుకోవడం, తర్వాత బెదిరింపులకు పాల్పడడం వంటి ఘటనలు పెరుగుతున్నాయి. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు భారతదేశం అత్యంత కఠినమైన చట్టాలలో ఒకటైన పోక్సోను అమలు చేస్తున్నది. ఈ చట్టం పిల్లలపై జరిగే లైంగిక నేరాలను, ప్రత్యేకంగా నిర్వచించి, బాధితులకు రక్షణ కల్పించడమే కాకుండా, నిందితులకు కఠిన శిక్షలు విధించే విధంగా ఉంటుంది. 

భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) అమల్లోకి వచ్చిన తర్వాత కూడా నిబంధనలు స్పష్టతతో కొనసాగుతున్నాయి. భారత చట్టాల ప్రకారం 18 ఏండ్ల వయస్సు నిండని బాలబాలికలను మైనర్‌గా పరిగణిస్తారు. మైనర్‌లపై జరిగే లైంగిక దాడుల కేసులను పోలీసులు ఈ చట్టం ప్రకారం నమోదు చేస్తారు. పోక్సో చట్టం ప్రకారం మైనర్‌ సమ్మతితో లైంగిక సంబంధం కలిగి ఉన్నప్పటికీ అత్యాచారం కిందనే పరిగణిస్తారు. ఎందుకంటే శారీరక, మానసిక, సామాజిక భద్రతను అర్థం చేసుకునే స్థితిలో మైనర్‌లు ఉండరని చట్టం భావన. 2012లో భారత ప్రభుత్వం పోక్సో చట్టం తీసుకొచ్చింది. పిల్లల రక్షణ, వేగవంతమైన విచారణ, బాధితులకు మానసిక భరోసా, గోప్యత పరిరక్షణ, నిందితులకు కఠిన శిక్షలు ఈ చట్టం ప్రధాన లక్ష్యాలు. ఇది సాధారణ క్రిమినల్‌ చట్టాలకు భిన్నంగా, ప్రత్యేకంగా చిన్నారుల భద్రత కోసం రూపొందించిన చట్టం. పోక్సో చట్టంలోని సెక్షన్‌ 3 ప్రకారం మైనర్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం. 

ఈ నేరానికి కనీసం పదేండ్లపాటు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు, జరిమానా ఉంటాయి. కేసు తీవ్రతను బట్టి కోర్టులు శిక్షను నిర్ణయిస్తాయి. పదేపదే దాడి చేయడం, బెదిరింపులు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేయడం, మైనర్‌ గర్భం దాల్చడం, నమ్మకాన్ని దుర్వినియోగం చేయడం వంటి సందర్భాల్లో కేసు సెక్షన్‌ 5 కింద నమోదవుతుంది. ఈ నేరానికి కనీసం 20 ఏండ్లపాటు జైలు, లేదా జీవిత ఖైదు, అత్యంత తీవ్రమైన సందర్భాల్లో మరణదండన వరకు శిక్ష పడుతుంది. పోక్సో చట్టం ప్రకారం అసభ్యకరమైన సందేశాలు పంపడం, న్యూడ్‌ ఫొటోలు పంపాలని అడగడం, ఫోన్‌, సోషల్‌ మీడియాలో వేధించడమూ నేరమే. ఇలాంటి నేరాలకు మూడేండ్ల వరకు జైలు శిక్ష, జరిమానా ఉంటాయి. పెండ్లి చేసుకుంటానని అబద్ధపు హామీ ఇచ్చి శారీరక సంబంధం పెట్టుకోవడాన్ని కూడా చట్టం తీవ్రమైన అంశంగా పరిగణిస్తుంది. చాలా సందర్భాల్లో బాధితులు ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు నిందితులు బెదిరింపులకు పాల్పడుతారు. వీటిని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. పోక్సో కేసులు సాధారణంగా నాన్‌ బెయిలబుల్‌. పోలీసులు కోర్టు వారంట్‌ లేకుండానే నిందితుడిని అరెస్ట్‌ చేయవచ్చు. చట్టపరమైన విచారణలో సాక్షాలు చాలా కీలకం.


Smacy News 48 minutes ago
Home Flash News